శ్రీశైలం ప్రాజెక్ట్: శ్రీశైలం జలాశయం నుంచి గురువారం నుంచి శుక్రవారం వరకు దిగువ ప్రాజెక్ట్‌లకు 5,424 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో 0.710 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసి నాగార్జునసాగర్‌కు 1,570 క్యూసెక్కుల నీటిని వదిలారు. బ్యాక్‌వాటర్ నుంచి కల్వకుర్తి ఎత్తిపోతలకు 2,400 క్యూసెక్కులు, ముచ్చుమర్రి ఎత్తిపోతలకు 494 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. శుక్రవారం సాయంత్రం సమయానికి జలాశయంలో 57.3866 టిఎంసీల నీరు నిల్వ ఉండగా.. డ్యాం నీటిమట్టం 836.90 అడుగులకు చేరుకుంది.
వృద్ధులకు ఉచిత న్యాయ సహాయం
డోన్ టౌన్: సబ్ జైలులో 70 ఏళ్ల పైబడిన వృద్ధులకు ఉచిత న్యాయ సహాయం అందిస్తామని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి తెలిపారు. డోన్ పట్టణంలోని సబ్‌జైలును శుక్రవారం సీనియర్ సివిల్ జడ్జి రామకృష్ణయ్య, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి వినోద్, మేజిస్ట్రేట్ జ్యోతి, జడ్జి లీలా వెంకటశేషాద్రి ఆకస్మిక తనిఖీ చేశారు. జైలులో ఏర్పాటు చేసిన ప్రిజన్ లీగల్ ఎయిడ్ హెల్ప్ డెస్క్‌ను పరిశీలించారు. జైలులో వసతులు, వైద్య సేవలపై ఆరా తీశారు. కోర్టు వాయిదాలకు ఖైదీలను కచ్చితంగా హాజరు చేయించాలని పోలీసులకు సూచించారు. ఏమైనా సమస్యలు ఉంటే 15100 ఫోన్ చేయాలన్నారు. తనిఖీల్లో జైలు సూపరింటెండెంట్ సురేష్, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ చీఫ్ శివరామచంద్రరావు, లీగల్ ఎయిడ్ కౌన్సిల్ మధవస్వామి, డాక్టర్ బాల చంద్రారెడ్డి, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.
గిరిజన ‘బహుళ’ కేంద్రాన్ని త్వరగా పూర్తి చేయాలి
శ్రీశైలం: గిరిజన బహుళ ప్రయోజన మార్కెటింగ్ కేంద్రాన్ని త్వరితంగా పూర్తిచేసి వినియోగంలోనికి తీసుకురావాలని ఇంజినీరింగ్ అధికారులను గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి మురళీధర్‌రెడ్డి ఆదేశించారు. చెంచులక్ష్మి ట్రైబల్ మ్యూజియాన్ని శుక్రవారం సాయంత్రం ఆయన పరిశీలించారు. చెంచు గిరిజనుల జీవనశైలి, ఆచార వ్యవహారాలు, సంస్కృతిపై మ్యూజియంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనలను చూసి వివరాలను తెలుసుకున్నారు. అనంతరం శ్రీశైలంలోని గిరిజన సహకార సంస్థ (జిసిసి) స్టోర్‌ను సందర్శించారు. గిరిజనులు సేకరించిన తేనె, నన్నారి శర్బత్, సీకాయ పౌడర్ తదితర ఉత్పత్తుల నాణ్యతను పరిశీలించారు. ఐటీడీఏ శ్రీశైలం ప్రాజెక్టు అధికారి పీవీఎస్ నాయుడు, వీబీ అండ్ రాంజీ ప్రతినిధి కేజీ నాయక్, వెలుగు ఏపీడీ పీక్లా నాయక్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ మురళి పాల్గొన్నారు.
నంద్యాలలో కొత్త డీసీసీబీ
కర్నూలు(అగ్రికల్చర్): రాష్ట్రంలో కొత్తగా ఆరు జిల్లా సహకార కేంద్రబ్యాంకులు ఏర్పాటుకు అద్యయనం పూర్తయిందని, ఇందులో భాగంగా నంద్యాలలో కూడా డీసీసీబీ ఏర్పాటవుతుందని.. అయితే ఆర్‌బీఐ నుంచి లైసెన్స్‌లు రావాల్సి ఉందని ఆంధ్రప్రదేశ్ సహకార బ్యాంకు(ఆప్కాబ్) మేనేజింగ్ డైరెక్టర్ రామకృష్ణ తెలిపారు. శుక్రవారం ఆయన కర్నూలులోని జిల్లా సహకార కేంద్రబ్యాంకును తనిఖీ చేశారు. సీఇవో బాలాజీ రావు, ఇతర సీనియర్ అధికారులతో బ్యాంకు ప్రగతి, రాబోయే ఆరు నెలల్లో చేపట్టబోయే కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కరువు ప్రాంతాల్లో గతంలో తీసుకున్న పంట రుణాలను రీ షెడ్యూల్ చేస్తామన్నారు. ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన కరువు నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో 99 సహకార సంఘాలు ఉండగా స్వల్పకాలిక రుణాల పంపిణీకి ప్రతి సంఘానికి కనిష్టంగా రూ.20 లక్షలు, గరిష్టంగా రూ.కోటి బడ్జెట్ ఇచ్చినట్లు వెల్లడించారు. స్వయం సహాయక సంఘాలకు పెద్ద ఎత్తున రుణాలు ఇవ్వడంతో పాటు బంగారంపై కూడా రుణాలు పంపిణీ చేయాలని సూచించారు.


