● ప్రస్తుతం ప్రజాధనం
దుర్వినియోగం చేస్తున్నారు
● మాజీ ఎమ్మెల్యే
శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి
బొమ్మలసత్రం: తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నంద్యాలను జిల్లాగా మార్చి ఎంతో అభివృద్ధి చేశామని మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్‌రెడ్డి అన్నారు. ప్రస్తుతం టీడీపీ నాయకులు శుభ్రంగా ఉన్న రోడ్లపైనే రోడ్లు వేసి ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. నంద్యాల పట్టణంలోని 2, 3, 4, 12, 46, 47 వార్డుల్లో శుక్రవారం మాజీ ఎమ్మెల్యేతో పాటు ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా, వైఎస్సార్‌సీపీ చైర్మన్ అభ్యర్థి డాక్టర్ దాల్‌మిల్ అమీర్‌బాషా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శిల్పారవి మాట్లాడుతూ.. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల వచ్చిందన్నారు. నంద్యాలలో ఎనిమిది పార్కులు, ఐదు అర్బన్ హెల్త్ సెంటర్లు ఏర్పాటయ్యాయన్నారు. పేదలైన 5,500 మందికి ఇళ్లపట్టాలు ఇచ్చామన్నారు. కలెక్టర్, జేసీ భవనాల నిర్మాణాలను చేసి చరిత్రలో నిలిచిపోయేలా అభివృద్ధి చేశామన్నారు. మళ్లీ అలాంటి పరిపాలన కావాలంటే ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని ప్రజలకు సూచించారు. తాము నంద్యాల్లో చేసిన అభివృద్ధి పనుల్లో సగం కూడా మంత్రి ఫరూక్ చేయలేదన్నారు. ఎమ్మెల్యేగా గెలిచాక ఒక్కసారి కూడా ప్రజలకు కనిపించలేదన్నారు.
అంతా వసూళ్లే కదా!
పేదలు రోడ్లపై బండ్లు పెట్టుకుని వ్యాపారాలు చేస్తుంటే వందల రూపాయల గేటు వసూలు చేయడం దారుణమని శిల్పా అన్నారు. మార్కెట్ యార్డులో రెండు ఎకరాలను రూ.80కే అద్దెకు తీసుకుని టీడీపీ నేతలు జల్సాలు చేస్తున్నారన్నారు. మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి కోసం పది మందికి పైగా పేర్లు మార్చారన్నారు. చివరికి జేబులు నింపుకుని నచ్చిన వ్యక్తికి కేటాయించారని విమర్శించారు. నంద్యాల ఎమ్మెల్యే మంత్రిగా ఉన్నా.. 30 నెలలు గడిచినా.. అభివృద్ధి లేకుండా కేవలం శిలాఫలకాలే కనిపిస్తున్నాయన్నారు. మంత్రి కుమారులను వారాల అబ్బాయిలని ప్రజలు పిలుస్తున్నారన్నారు. గతంలో పేదలకు బియ్యం పంపిణీ చేసేందుకు బండి ఇంటికి వచ్చేదని, ప్రస్తుతం బియ్యం కొనేందుకు టీడీపీ నాయకులు బండి పంపుతున్నారని ఆరోపించారు.
ఫోర్జరీ సంతకాలతో మోసం
ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా మాట్లాడుతూ.. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి వీధిలో ఇసుక, కంకర, రేషన్ బియ్యం లాంటి మాఫియాలు పెరిగిపోయాయన్నారు. గెలుపు కోసం ఫోర్జరీ సంతకాలు చేసి వైఎస్సార్‌సీపీ అభ్యర్ధిగా ఉన్న మహిళను మోసం చేశారని ఆరోపించారు. అనంతరం 2వ వార్డు అభ్యర్థి మునయ్య, 3వ వార్డు అభ్యర్థి మహమ్మద్ యూనీస్, 4వ వార్డు అభ్యర్థి పురంధర్ కుమార్, 5వ వార్డు అభ్యర్థి మజీజ్‌ఖాన్, 11వ వార్డు అభ్యర్థి కలామ్‌బాషా, 12వ వార్డు అభ్యర్థి మస్తాన్‌బాబా, 46వ వార్డు అభ్యర్థి షాదిక్‌బాషా, 47వ వార్డు అభ్యర్థి కాల్వ అసీనా మాట్లాడారు. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. చైర్మన్ అభ్యర్థి డాక్టర్ దాల్‌మిల్ అమీర్‌బాషాను ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా విభాగం జనరల్ సెక్రటరీ డాక్టర్ శశికళారెడ్డి, జిల్లా మేధావుల సంఘం అధ్యక్షుడు రసూల్ అజాద్, నాయకులు భీమునిపల్లి వెంకటసుబ్బయ్య, అరీఫ్ నాయక్, గన్నీ కరీముల్లా పాల్గొన్నారు.


