పాణ్యం: గత నెల 22వ తేదీన గోరుకల్లు రిజర్వాయర్ గేటును ఎత్తి ప్రజల ఆస్తికి నష్టం కలిగించిన ఘటనపై శుక్రవారం నంద్యాల ఏఎస్పీ సుస్మిత విచారణ చేపట్టారు. ముందుగా పాణ్యం పోలీసుస్టేషన్‌లో సంఘటనకు గల కారణాలపై పోలీసులు సేకరించిన సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం గోరుకల్లు జలాశయం గేట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా గేట్లు ఎత్తే సమయంలో విధుల్లో ఎవరు ఉన్నారు, ఏ సమయంలో గేటు తెరుచుకుంది, గేటు ఆపరేటింగ్ ఎలా చేశారు, సకాలంలో అధికారుల స్పందన తదితర అంశాలపై క్షుణ్ణంగా అధికారులను అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే విచారణ పూర్తి చేస్తామన్నారు. ఇందుకు సంబంధించి క్లూస్ టీం విచారణ ఫోన్ కాల్ డేటా వివరాలు ఇతర విచారణ అంశాలను వేగంగా చేపడుతున్నట్లు తెలిపారు. ఆమె వెంట సీఐ కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎస్‌ఐ నరేంద్రకుమార్‌రెడ్డి ఉన్నారు.
మంత్రాలయంలో
భక్తుల రద్దీ
మంత్రాలయం: ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రానికి భక్తులు పోటెత్తారు. శుక్ర, ఆదివారాలు సెలవులు కావడంతో భక్తుల వేలాదిగా తరలివస్తున్నారు. కర్ణాటక, తమిళనాడు, తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు ఎక్కువ సంఖ్యలో వచ్చారు. భక్తుల రాకతో శ్రీమఠం మధ్వ కారిడార్ సందడిగా కనిపించింది. రాఘవేంద్రుడి దర్శనానికి రెండు గంటల సమయం పట్టింది. అన్నపూర్ణ భోజనశాల, పరిమళ ప్రసాదం కౌంటర్లు, మంచాలమ్మ, రాఘవేంద్రుల దర్శన క్యూలైన్లు కిక్కిరిశాయి. భక్తులు మంచాలమ్మ, రాఘవేంద్రుల బృందావనం దర్శనం చేసుకుని ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయల వెండి, స్వర్ణ రథోత్సవాల్లో పాల్గొన్నారు.
హంద్రీలో ఆగని
ఇసుక దందా!
గోనెగండ్ల: హంద్రీ నది నుంచి ఇసుక అక్రమ రవాణా రాత్రీ పగలు తేడా లేకుండా నిర్విరామంగా కొనసాగుతోంది. ఒక ట్రాక్టర్ ఇసుకను రూ.4వేల నుంచి రూ.5 వేలకు అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన ఉచిత ఇసుక పథకం ఎక్కడా కనిపించడం లేదు. గోనెగండ్ల మండలంలో 28 గ్రామాలు ఉన్నాయి. గంజిహళ్లి, హెచ్. కై రవాడి, పుట్టపాశం, వేముగోడు, తిప్పనూరు గ్రామాల మీదుగా వెళ్లే హంద్రీనదిలో మాత్రమే ఇసుక దొరుకుతోంది. ఆయా గ్రామాలకు తాగునీటి కోసమని హంద్రీనది సమీపంలో వేసిన బోర్ల ద్వారానే నీటిని సరఫరా చేస్తున్నారు. ఇసుకను అక్రమంగా తరలిస్తుండడంతో భూగర్భ జలాలు అడుగంటి తాగునీటి సమస్య ఎదురువుతోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పుట్టపాశం గ్రామ సమీపంలోని హంద్రీనది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను రెండు రోజుల క్రితం మైనింగ్ అధికారులు పట్టుకున్నారు. పగటి పూట బహిరంగంగా ఇసుక తరలిస్తున్నా, అధిక ధరలకు అమ్ముతున్నా అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు.
అహోబిలం ఫొటో గ్రాఫర్‌కు జాతీయ స్థాయి పురస్కారం
ఆళ్లగడ్డ: ఫొటోగ్రఫీ అకాడమీ ఆఫ్ ఇండియా (పీఏఐ), ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత, సాంస్కృతిక కమిషన్‌ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ ఫొటోగ్రఫీ పోటీల్లో ప్రసాద్ తీసిన ఫొటోకు ‘ఎక్సలెన్స్ అవార్డ్ 2026’ లభించింది. శుక్రవారం గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో అహోబిలం ఫొటో గ్రాఫర్ పురస్కారం అందుకున్నారు.


