నంద్యాల(అర్బన్): మహనీయులు మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి స్ఫూర్తితో దేశాభివృద్ధిలో భాగస్వాములవుదామని రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్, జిల్లా కలెక్టర్ రాజకుమారి అన్నారు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం నంద్యాల పట్టణం గాంధీ చౌక్ సర్కిల్‌లోని ఆయన విగ్రహానికి మంత్రి, కలెక్టర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ.. సత్యం, శాంతియుత పోరాటం, జాతి సమైక్యత వంటి విలువలను సమాజానికి అందించిన మహాత్మా గాంధీ జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శమన్నారు. ఆయన చూపిన పోరాట పటిమ, శాంతియుత మార్గం అనుసరణీయ మన్నారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రపంచంలోని అనేక దేశాలు యుద్ధాలు, హింసాత్మక పోరాటాల ద్వారా స్వాతంత్య్రాన్ని సాధించినప్పటికీ, భారతదేశంలో మహాత్మా గాంధీ సత్యం, శాంతి, అహింసలను ఆయుధాలుగా చేసుకుని స్వాత ంత్య్ర ఉద్యమాన్ని నడిపించారన్నారు. ప్రజలను ఏకతాటిపైకి తీసుకువచ్చి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా అహింసాయుత పోరాటాన్ని బలోపేతం చేశారన్నారు. దేశ రక్షణలో సైనికుడి పాత్రతో పాటు దేశ ఆహార భద్రతలో రైతు ప్రాధాన్యతను గుర్తించి ‘జై జవాన్ – జై కిసాన్’ నినాదాన్ని అందించారన్నారు.


