డోన్: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి భయంతోనే టీడీపీ నేతలు, నాయకులు ఏకగ్రీవాల జపం చేస్తున్నారని, ప్రజాస్వామ్య ఎన్నికలంటే టీడీపీ నేతల్లో వణుకు మొదలైందని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. డోన్‌లో శుక్రవారం ఆయన తన స్వగృహంలో పార్టీ క్రియాశీల కార్యకర్తలకు ఐడీ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలీసు యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకొని వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను భయపెట్టి స్థానిక సంస్థల్లో లబ్ధి పొందాలని టీడీపీ నేతలు పగటి కలలు కంటున్నారన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చకుండా ప్రజల ముందుకు వెళ్లి ఓట్లు అడిగే దమ్ము టీడీపీ నేతలకు లేదన్నారు. ప్రజలకు ఏమి మేలు చేశారని తమ ముఖం చూపుతారని ప్రశ్నించారు. టీడీపీ నేతలకు దమ్మూ ధైర్యం ఉంటే స్థానిక ఎన్నికల్లో ప్రజాస్వామ్య బద్ధంగా పోటీలో నిలవాలని సవాల్ విసిరారు. వైఎస్సార్‌సీపీ కోసం నిరంతరం శ్రమించే కార్యకర్తల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని తమనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రూ.5లక్షల ప్రమాద బీమా చేపట్టారన్నారు. పార్టీ అభ్యున్నతికి శ్రమించే కార్యకర్తలకు భవిష్యత్‌లో కీలక పదవులు లభిస్తాయన్నారు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తే నామినేటెడ్ పదవుల్లో సింహభాగం కార్యకర్తలకే దక్కుతాయన్నారు.


