లోకేష్‌ వచ్చేదెప్పుడు.. ఆశలు ఎగిరేదెప్పుడు! | - | Sakshi
Sakshi News home page

లోకేష్‌ వచ్చేదెప్పుడు.. ఆశలు ఎగిరేదెప్పుడు!

Sep 3 2026 8:53 AM | Updated on Sep 3 2026 8:53 AM

విమానయాన మంత్రి రామ్మోహన్‌ నాయుడు అనధికార ఆదేశాలు

వాస్తవానికి ఆగస్టు 22నే ప్రారంభానికి సిద్ధం చేసిన ఓరియంట్స్‌ సంస్థ

ప్రస్తుతం థియరీ క్లాసులకే పరిమితమైన విద్యార్థులు

కర్నూలు(సెంట్రల్‌): ఓర్వకల్‌ విమనాశ్రయంలో రాష్ట్రంలోనే తొలి పైలట్‌ శిక్షణ కేంద్రం ఏర్పాటైంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలోనే మైసూరుకు చెందిన ఓరియంట్స్‌ ఫ్లైట్స్‌ ఏవియేషన్‌ అకాడమీ శిక్షణ కేంద్రం ఏర్పాటుకు ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఆ సంస్థకు విమానాశ్రయంలో 1.2 ఎకరాలు కేటాయించగా.. శిక్షణనిచ్చేందుకు అధునాత హ్యాంగర్‌ భవనాన్ని సిద్ధం చేశారు. గత ఆగస్టు 22న ప్రారంభోత్సవానికి ఆ సంస్థ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అయితే ఆగస్టు 18న ఓర్వకల్‌ డ్రోన్‌ సిటీలో కేంద్ర పౌర విమానయాన శాఖమంత్రి రామ్మోహన్‌నాయుడు పర్యటించారు. ఆ సమయంలో విషయాన్ని అధికారులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అయితే మంత్రి లోకేష్‌తో శిక్షణ కేంద్రాన్ని ప్రారంభిస్తే ఆయన మెప్పు పొందవచ్చనే ఉద్దేశంతో అనధికార ఆదేశాలిచ్చి కార్యక్రమాన్ని వాయిదా వేయించినట్లుగా చర్చ జరుగుతోంది.

శిక్షణ విమానాల ట్రయల్‌ రన్‌ విజయవంతం

చైన్నెలోని హిందుస్తాన్‌ గ్రూపు ఆఫ్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌లో ఓరియంట్‌ ఫ్లైట్స్‌ ఏవియేషన్‌ అకాడమీ ఉంది. ఈ సంస్థ మైసూరులో 12 ఏళ్లుగా పైలట్‌ శిక్షణనిస్తోంది. రెండో కేంద్రాన్ని కర్నూలులో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సంస్థ వద్ద సెస్నా, టెక్నామ్‌ బ్రాండ్ల సింగిల్‌ ఇంజిన్‌, మల్టీ ఇంజిన్‌ శిక్షణ విమానాలు ఉన్నాయి. మైసూరులో ఉన్న శిక్షణ కేంద్రంలో మూడింటిని ఇకపై కర్నూలు విమానాశ్రయంలో ఉంచాలని భావిస్తున్నారు. ఇప్పటికే శిక్షణ విమానాలను కర్నూలుకు తీసుకొచ్చి ఉంచారు. అంతేకాక కర్నూలులో పైలట్‌ శిక్షణకు సంబంధించి తరగతి గది బోధనకే పరిమితమైన పైలట్లకు శిక్షణ ఇచ్చి ట్రయల్‌ రన్‌ విజయవంతం చేసింది. డైరక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ ప్రమాణాల ప్రకారం సుమారు వంద కోట్లతో అకాడమీ ఏర్పాటుకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకపోవడంతో ప్రారంభానికి ఆగస్టు 22వ తేదీని ముహూర్తంగా నిర్ణయించారు.

ఇంతలోనే ఇలా...

కొన్ని రోజుల్లో ప్రారంభోత్సవాన్ని పూర్తి చేసేందుకు మంత్రులు బీసీ జనార్ధన్‌రెడ్డి, టీజీ భరత్‌గుప్తా అపాయింట్‌మెంట్‌ తీసుకున్నారు. ఆ మేరకు ఆహ్వాన పత్రికలు ముద్రించడం, నాయకులకు ఆహ్వానాలు పలకడం పూర్తయింది. అయితే కేంద్ర మంత్రి ఆదేశాలతో ప్రారంభోత్సవ కార్యక్రమం వాయిదా పడింది. మంత్రి నారా లోకేష్‌ ఎప్పుడు వస్తారో తెలియని పరిస్థితుల్లో.. ఆయన వచ్చే వరకు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవద్దని చెప్పడంతో అకాడమీ నిర్వాహకులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఇప్పటికే కొందరు విద్యార్థులు పైలట్‌ శిక్షణ పొందుతున్నారు. అయితే ప్రస్తుతం వీరి శిక్షణ తరగతి గదికే పరిమితమైంది. పైలట్‌ శిక్షణకు ప్రాక్టికల్స్‌ అత్యంత ముఖ్యం. అలాంటిది విద్యార్థుల ఆశలను ఎగరనివ్వకుండా రాజకీయ స్వార్థంలో ఓ నేత శిక్షణ కేంద్రం ప్రారంభోత్సవాన్ని అడ్డుకోవడం విమర్శలకు తావిస్తోంది.

ఏవియేషన్‌ పైలట్‌ శిక్షణ కేంద్రం ప్రారంభం వాయిదా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement