మంత్రాలయం: శ్రీరాఘవేంద్రుల 355వ ఆరాధన సప్తరాత్రోత్సవాలు అట్టహాసంగా ముగిశాయి. వేడుకల్లో భాగంగా శనివారం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థుల నేతృత్వంలో రాత్రి ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలకు సర్వ సమర్పణోత్సవం నిర్వహించారు. ఉత్సవమూర్తిని పంచవాహనాలపై ఊరేగించారు. గజ, అశ్వ, సింహ, మయూరం వాహనాలపై కొలువుంచి పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు వాహ నోత్సవానికి శ్రీకారం పలికారు. అశేష భక్తజన వాహిని మధ్య రాయరు ఎంతో రమణీయంగా ఊరేగారు. అనంతరం ఊంజల మంటపంలో రాయరుకు ఉయ్యాల, ఛామర్ల సేవ కానిచ్చారు. యోగీంద్ర మంటపంలో చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. మంత్రాలయం మండలంలో అనుమంత్రాలయంగా పేరుగాంచిన తుంగభద్రలో ఆఖరి రోజు ఉత్సవాలు నిర్వహించారు. పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు గ్రామాన్ని చేరుకుని మృత్తిక బృందావనానికి విశేష పూజలు చేపట్టారు. అనంతరం పండితులు, భక్తులు వసంతోత్సవం జరుపుకుని మంగళహారతులు పట్టారు. వేడుకలో భక్తులకు రాఘవేంద్రుల వైభవాన్ని ప్రవచించారు.


