● ఉమ్మడి కర్నూలు జిల్లాలో 3.50 లక్షలకు పైగా వ్యాపారులు ఉన్నారు.
● తోపుడు బండ్లు, రోడ్డుసైడ్ వ్యాపారులు 1.28 లక్షల మంది ఉన్నారు.
● గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో జగనన్న తోడు కింద
1.18 లక్షల మందికి పావలా వడ్డీకే రుణాలు ఇచ్చింది.
● చిన్న వ్యాపారులకు రూ.148.87 కోట్ల రుణాలు అందించింది.
● చంద్రబాబు ప్రభుత్వంలో చిరు వ్యాపారులకు ప్రోత్సాహకాలు లేవు.
● జగనన్న తోడు కింద రుణాలు పొందిన వారిలో పది శాతం మంది
ప్రస్తుతం వ్యాపారాలు బంద్ చేశారు.
● ప్రజల చేతుల్లో చిల్లిగవ్వ లేకపోవడంతో వ్యాపారాలు వెలవెలబోతున్నాయి.
కర్నూలు(అగ్రికల్చర్): పట్టణాల్లో, నగరాల్లో రోడ్ల పక్కన చిరు వ్యాపారుల దీన చూపులు కనిపిస్తున్నాయి. కాలువల పక్కన తడికెలతో ఏర్పాటు చేసుకున్న దుకాణాలు మూతపడుతున్నాయి. ఆరోగ్యానికి మేలు చేసే పండ్లను సైతం ప్రజలు కొనుగోలు చేయలేకపోతున్నారు. హుందాగా తిరిగేందుకు మంచి దుస్తులు ధరించడానికి కూడా చాలా మంది వద్ద డబ్బులు ఉండటం లేదు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో పేదరికం పెరిగిపోయిందని చెప్పడానికి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. జీవనోపాధులను పెంచే సంక్షేమ పథకాలు లేకపోవడమే ఇందుకు కారణంగా నిలిచింది. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటై 26 నెలలు అవుతున్నా ఎన్నికల సమయంలో ఊరూవాడా ప్రకటించిన సంక్షేమ పథకాల అమలు లేదు. ప్రజల్లో నగదు సర్క్యులేషన్ లేకపోవడంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో క్రయవిక్రయాలు తగ్గిపోయాయి. ఫలితంగా వ్యాపారాలు పడిపోయాయి. ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహం లేకపోవడంతో అనేక మంది వ్యాపారులు అప్పులపాలయ్యారు.
చిన్న వ్యాపారుల మనుగడ ప్రశ్నార్థకం
మున్సిపాలిటీల్లో, మేజర్ గ్రామ పంచాయతీల్లో చిన్న వ్యాపారులు, రోడ్డు పక్కన తోపుడుబండ్లపై వ్యాపారాలు చేసుకునే వారు ట్రేడ్ లైసెన్స్ తీసుకుంటారు. అధికారిక లెక్కల ప్రకారం ఉమ్మడి కర్నూలు జిల్లాలో 3.50 లక్షల మంది వ్యాపారులు ఉన్నారు. వీరిలో లక్ష మంది వరకు వీధుల్లో బండ్లపై చిరు వ్యాపారాలు చేస్తున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం జగనన్న తోడు కింద ఉమ్మడి జిల్లాలో చిన్న వ్యాపారులకు పావలా వడ్డీతో రుణ సదుపాయం కల్పించింది. రికార్డు స్థాయిలో 1.18 లక్షల మంది చిన్న వ్యాపారులకు బ్యాంకుల ద్వారా రూ.148.87 కోట్లు పావలా వడ్డీపై రుణ సదుపాయం కల్పించింది. నిర్ద్ధిష్ట గడువులో చెల్లించి మళ్లీ తీసుకుని వ్యాపారాలు అభివృద్ధి చేసుకున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు తర్వాత చిన్న వ్యాపారులకు పావలా వడ్డీకే రుణాలు పంపిణీ చేసే ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో చాలా మంది దిక్కులు చూడాల్సి వస్తోంది. కొంత మంది ఆర్థికంగా నష్టపోయి వ్యాపారం మానుకున్నారు. చిన్న వ్యాపారుల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది.
దెబ్బతిన్న జీవనోపాధి
గత వైఎస్సార్‌పీ ప్రభుత్వం ఐదేళ్లలో వైఎస్సార్ రైతుభరోసా, అమ్మఒడి, వైఎస్సార్ చేయూత, ఆసరా, నేతన్న నేస్తం, కాపు నేస్తం, విద్యాదీవన, వసతి దీవెన, కళ్యాణమస్తు ఇలా అనేక సంక్షేమ పథకాలు అమలు చేసింది. నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు నగదు విడుదల చేసింది. ప్రతి నెలా ఏదో ఒక కార్యక్రమం కింద సంబంధిత వర్గాల ఖాతాల్లోకి నగదు వెళ్లడంతో ప్రజల్లో కొనుగోలు సామర్థ్యం పెరిగింది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల రూపంలో ఉమ్మడి కర్నూలు జిల్లాకు రూ.12,500 కోట్ల వరకు లబ్ధి చేకూరింది. చంద్రబాబు ప్రభుత్వంలో సంక్షేమ పథకాల ఊసే కరువైంది. వ్యవసాయం కలసిరాక గతేడాది రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ ఏడాది వర్షాలు లేక ఇప్పటి వరకు పంటలు వేయలేదు. సామాన్య, మధ్య తరగతి ప్రజల జీవనోపాధి పూర్తిగా దెబ్బతినింది. వ్యాపారాలు లేక కిరాణం షాపులు, ఎలక్ట్రానిక్, వస్త్ర దుకాణాలు చాలా వరకు మూతపడ్డాయి. చిన్న వ్యాపారాల పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది.
‘మద్దతు’ కరువు
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఒక్కో కుటుంబానికి సగటున ఏడాదికి రూ.75 వేల నుంచి లక్ష వరకు నగదు ప్రయోజనం లభించింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఏడాదికి రూ.3,500 కోట్ల వరకు నగదు నేరుగా ప్రజల బ్యాంకు ఖాతాలకు జమ అయ్యేది. రైతులు పండించిన పంటలకు ధరలు లేనప్పుడు ఆర్‌బీకేల వారీగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరలతో కొనుగోలు చేసింది. చంద్రబాబు ప్రభుత్వంలో ఒక్కో కుటుంబానికి ఆర్థిక వెసలుబాటు దొరకలేదు. రైతుల పండించిన పంటలకు మద్దతు ధర లభించలేదు. ఆర్‌బీకేలను రైతు సేవా కేంద్రాలుగా మార్చినా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. ఉచిత పంటల బీమా అందక రైతులు తీవ్రంగా నష్టపోయారు. డబ్బులు లేక వ్యవసాయం ఆధారంగా ఉండే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా మంది నిత్యావసరాలు సైతం కొనుగోలు చేయని దుస్థితిలో ఉన్నారు.
కర్నూలులోని స్ట్రీట్ మార్కెట్‌లో మాకు షాపు ఉంది. ఇందులో అన్ని రకాల పండ్లను అమ్ముతున్నాం. రెండేళ్ల క్రితం వరకు వ్యాపారాలు బాగా ఉండేవి. ఇప్పుడు అమ్మకాలు లేవు. ఉదయం నుంచి రాత్రి వరకు షాపులోనే ఖాళీగా ఉంటున్నాం. – సావిత్రమ్మ, కర్నూలు
రెండేళ్లుగా కిరాణ వ్యాపారం పడిపోయింది. వస్తువులు కొనేవారు లేరు. 2023తో పోలిస్తే ఇప్పుడు వ్యాపారాలు 30 శాతం వరకు పడిపోయాయి. దీనికి తోడు వర్షాలు లేకపోవడంతో ప్రజలు ఆందోళనలో ఉన్నారు. – రమేష్ గుప్తా, కర్నూలు
మేం వ్యవసాయానికి సంబంధించిన పరికరాలతో వ్యాపారం చేస్తుంటాం. రెండేళ్ల క్రితం వ్యాపారం బాగుండేది. ఇప్పుడు వ్యవసాయం కలసి రాక రైతులు పరికరాలు కొనగోలు చేయడం లేదు. మాదే కాదు 50 శాతం పైగా వ్యాపారాలు పడిపోయాయి. వ్యాపారుల మనుగడ దెబ్బతినింది.
– మహమ్మద్ రఫీ, కర్నూలు
వీధిన పడ్డారు!
కర్నూలుతో పాటు వివిధ పట్టణాల్లో స్ట్రీట్ మా ర్కెట్‌లను గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కర్నూలులోని వినాయక ఘాట్ దగ్గర కేసీ కెనాల్ పక్కన స్ట్రీట్ మార్కెట్ రెండేళ్ల క్రితం కళకళలాడుతూ ఉండేది. అలాగే ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ కార్యాలయం ఎదుట ఫుట్‌పాత్‌పై ఏర్పా టు చేసిన స్ట్రీట్ మార్కెట్‌లో కొనుగోళ్లు బాగా జరిగేవి. కృష్ణానగర్‌లోని ఐటీసీ దగ్గర, గుత్తి పెట్రోల్ బంక్ ప్లైఓవర్ కింద చిన్న హోటళ్లు ఉండటంతో అనేకమందికి అవకాశం లభించింది. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ప్రోత్సాహాలు లేక స్ట్రీట్ మార్కెట్లు అస్తవ్యస్తం అయ్యాయి. ఆర్థికంగా నష్టపోయి చిన్న వ్యాపారులు దుకాణాలను మూత వేసి వీధిన పడ్డారు.
అప్పుల బాధతో వ్యాపారి ఆత్మహత్య
కర్నూలు: వ్యాపారంలో పెట్టుబడి పెట్టి నష్టపోయి అప్పులు తీర్చలేక కర్నూలు పాతబస్తీలోని వడ్డెగేరిలో నివాసముంటున్న అగ్నూరు నరేష్ (36) ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దాదాపు రూ.15 లక్షల దాకా అప్పు చేసి కొంతకాలంగా మనోవేదనకు గురై మద్యానికి బానిసయ్యాడు. గురువారం రాత్రి కూడా మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. అప్పులు ఎలా తీర్చాలో తెలియడం లేదని, భార్య తెలుగు రేణుకకు చెప్పి బాధ పడ్డాడు. భోజనం చేసి అందరూ పడుకున్న తర్వాత బెడ్ రూమ్‌లోకి వెళ్లి తలుపులు వేసుకుని గడియ పెట్టుకుని ఉరి వేసుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత భార్య రేణుక తలుపులు తట్టినప్పటికీ తీయకపోవడంతో కుటుంబ సభ్యులను పిలిచి తలుపులు తెరిచి చూడగా సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించాడు. వెంటనే కిందకు దించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతుడి భార్య రేణుక ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఒకటో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


