శ్రీశైలంటెంపుల్: ధార్మిక కార్యక్రమాల నిర్వహణలో భాగంగా శ్రీశైల దేవస్థానం మూడవ శుక్రవారం ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతాలను నిర్వహించింది. శ్రీశైలంలోని చంద్రావతి కల్యాణ మండపంలో నిర్వహించిన సామూహిక వరలక్ష్మీ వ్రతాలలో శివసేవకులు 600 మంది, ఇతర భక్తులు 300 మంది పాల్గొన్నారు. వ్రతానికి కావాల్సిన పూజా ద్రవ్యాలన్నింటిని దేవస్థానం సమకూర్చింది. వ్రతంలో పాల్గొన్న ప్రతి ఒక్కరి కోసం వేర్వేరుగా కలశాలను నెలకొల్పి శాస్త్రోక్తంగా వ్రతం నిర్వహించారు. అర్చకులు వ్రతకథను పఠించి, వ్రత మహిమా విశేషాలను భక్తులకు వివరించారు. వ్రతాన్ని జరిపించుకున్న వారందరికీ చీర, రవికవస్త్రం, పూలు, గాజులు, కంకణాలు, వృక్ష సంపదగా తులసిమొక్క, శ్రీశైలప్రభ మాసపత్రిక, మూడు రకాల ప్రసాదాలు అందజేశారు. అనంతరం భక్తులందరికీ ప్రత్యేక క్యూలైన్ ద్వారా స్వామిఅమ్మవార్ల దర్శనం కల్పించారు.


