ఆళ్లగడ్డ: అహోబిలం లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో పౌర్ణమిని పురస్కరించుకుని శుక్రవారం విశేష పూజలు నిర్వహించారు. ఉద యం మూలమూర్తులకు నిత్యపూజలు నిర్వహిచిన అనంతరం ఉత్సవమూర్తులు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రహ్లాదవరదస్వాములను ఆలయం ముఖద్వారం మండపంలో కొలు వుంచి పంచామృతాలతో అభిషేకించి దూపదీపాలతో మహామంగళహారతి అనంతరం నైవేద్యం నివేదించారు. రాత్రి విశేషాలంకరణలో స్వామి ఉభయ దేవేరులతో కొలువుదీరి మాఢవీధుల్లో విహరిస్తూ భక్తులకు కనువిందు చేశారు. తిరిగి దేవాలయం చేరుకున్న అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేసి కార్యాక్రమాన్ని ముగించారు.
ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ
డోన్ టౌన్: జిల్లాలో ఐటీఐలో మిగిలి పోయిన సీట్ల భర్తీ కోసం నాల్గవ విడత ప్రవేశాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కన్వీనర్, డోన్ ప్రభుత్వ ఐటీఐ ప్రిన్స్‌పాల్ నాగకేశాలు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 28వ తేదీ నుంచి 31వ తేదీ ఉదయం 11.30 గంటల లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోని సమీప ప్రభుత్వ ఐటీఐలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకుని 31వ తేదీ జరిగే కౌన్సిలింగ్ హాజరుకావాలన్నా రు. మరిన్ని వివరాలకు సమీప ప్రభుత్వ ఐటీఐల్లో సంప్రదించాలన్నారు.
బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు
కొలిమిగుండ్ల: మండల కేంద్రం కొలిమిగుండ్ల ఎస్సీ కాలనీలో శుక్రవారం బాల్య వివాహాన్ని అధికారులు అడ్డుకున్నారు. కాలనీకి చెందిన ఓ బాలికకు పెళ్లి నిశ్చయమైంది. మరొ కొన్ని గంటల్లో పెళ్లి జరగాల్సి ఉంది. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకున్నారు. బాల్య వివాహం చేస్తున్నారనే సమాచారం అందుకున్న తహసీల్దార్ షఫీ, సీఐ రమేష్‌బాబు, ఐసీడీఎస్ సిబ్బంది, అంగన్‌వాడీ కార్యకర్తలు కాలనీకి చేరుకున్నారు. మేజర్ కాక ముందే పెళ్లి చేయరాదని తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. చిన్న వయస్సులో పెళ్లి చేస్తే జరిగే అనర్థాల గురించి వివరించారు.
నేడు జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు
కర్నూలు(అర్బన్): జిల్లా పరిషత్ స్థాయీ సంఘ సమావేశాలను శనివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు జెడ్పీ సీఈఓ ఆర్ సుధాకర్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి ఉత్తర్వుల మేరకు ఏడు స్థాయీ సంఘాల్లో భాగంగా గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, సాంఘిక సంక్షేమం, విద్య, వైద్యం, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమం, పనులు ఆర్థిక ప్రణాళిక శాఖలపై సమీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు. సమావేశాలకు ఆయా స్థాయీ సంఘాల చైర్‌పర్సన్లు, జెడ్పీటీసీ సభ్యులు, ఉమ్మడి జిల్లాకు చెందిన వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు తప్పక హాజరు కావాలని కోరారు.
శ్రీశైలం ప్రాజెక్టుకు నిలిచిన ఇన్‌ఫ్లో
శ్రీశైలంప్రాజెక్ట్: శ్రీశైలం జలాశయానికి జూరాల ప్రాజెక్ట్ నుంచి వచ్చి చేరే వరద ప్రవాహం శుక్రవారం పూర్తిగా నిలిచిపోయింది. ఎగువన వర్షాలు లేకపోవడం, నీటిమట్టం కూడా తగ్గుతుండడంతో జూరాలలో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేశారు. తెలంగాణ ప్రాంతానికి అవసరమైన విద్యుత్‌లో కొంత భాగం ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి చేస్తున్నారు. గురువారం నుంచి శుక్రవారం వరకు ఎడమగట్టు కేంద్రంలో 11.929 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసి నాగార్జునసాగర్‌కు 24,226 క్యూసెక్కుల నీటిని వదిలారు. ప్రస్తుతం జలాశయంలో 156.0124 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
గ్రామాల్లో చిన్నారులకు విషజ్వరాలు
వెల్దుర్తి: గ్రామాల్లో చిన్నారులు విషజ్వరాల బారిన పడుతున్నారని జిల్లా మలేరియా అధికారి వెంకటేశ్వర్లు, ఏఎమ్‌ఓ విజయ్‌కుమార్ గుర్తించారు. వెల్దుర్తి సీహెచ్‌సీకి శుక్రవారం వచ్చి అక్కడ నమోదవుతున్న కేసుల వివరాలు సేకరించారు. అనంతరం ఆయా గ్రామాలకు వెళ్లి పారిశుద్ధ్య పనులు చేయించారు. రామళ్లకోట, గోవర్ధనగిరి పీహెచ్‌సీల వైద్యాధికారులు భువనతేజ, శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు.


