ఆత్మకూరు: తెలుగుగంగ ఆయకట్టుకు ఇంకెప్పుడు నీరిస్తారు.. రైతులు పంటలు ఎలా సాగు చేయాలి.. అని మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆయకట్టుకు నీరు విడుదల చేయాలని కోరుతూ సెప్టెంబర్ 1వ తేదీన తలపెట్టిన వెలుగోడు రిజర్వాయర్ ముట్టడి కార్యక్రమం సన్నాహక సమావేశాన్ని శుక్రవారం పట్టణంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో నిర్వహించారు. పార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శిల్పా మాట్లాడుతూ.. గతంలో వీబీఆర్‌లో 3 టీఎంసీల నీరున్నా.. విడుదల చేశామని స్థానిక ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి గొప్పలు చెప్పుకున్నారని, ప్రస్తుతం 10 టీఎంసీల నీరున్నా ఎందుకు విడుదల చేయడం లేదో రైతులకు సమాధానం చెప్పాలన్నారు. శ్రీశైలం జలాలను తెలంగాణ ప్రభుత్వం తరలిస్తున్నా కూటమి నేత లు చోద్యం చేస్తున్నారని విమర్శించారు. తెలుగుగంగ, కేసీకెనాల్, సిద్ధాపురం చెరువులకు సాగునీటిని విడుదల చేసి రాయలసీమ రైతులను ఆదుకోవాలన్నారు. తెలుగుగంగ ఆయకట్టు కింద తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయని, కనీసం ఒక పంటకైనా సాగునీరు విడుదల చేయకపోతే రైతుల పరిస్థితి ఘోరంగా మారుతుందన్నారు. ఇప్పటికే నియోజకవర్గ పరిధిలోని బండిఆత్మకూరు, మహానంది మండలాల్లో వరినాట్లు చేసి ట్రాక్టర్ ట్యాంకర్ల ద్వారా నీటిని తెచ్చుకుని కాపాడుకుంటున్నారన్నారు. సమావేశంలో పార్టీ మండల, పట్టణాధ్యక్షులు సయ్యద్‌మీర్, రాజమోహన్‌రెడ్డి, బైరాపురం మహబూబ్‌బాషా, స్వామి, రవీంద్ర, లక్ష్మిరెడ్డి, రాజు, విష్ణువర్ధన్‌రెడ్డి, సురేష్, పార్వతి, అబ్దుల్ కలాం, వెంకటస్వామిగౌడ్, అల్లీషేర్, లాలు, తిమ్మ య్య, షఫీవున్, శేషిరెడ్డి, లక్ష్మన్నయాదవ్, కోట్ల నాగేశ్వరరెడ్డి, యల్లప్ప, ప్రభుదాస్‌తో పాటు వివిధ గ్రామాల పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వీబీఆర్ ముట్టడికి తరలిరండి
వెలుగోడు: తెలుగుగంగ ఆయకట్టు రైతుల సాగునీటి విడుదల కోసం సెప్టెంబర్ 1వ తేదీన చేపట్టిన వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (వీబీఆర్) ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలు, రైతులతో శిల్పా చక్రపాణిరెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అందుబాటులో నీరు ఉన్నా ఆయకట్టుకు విడుదల చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ తీరుకు నిరసన చేపట్టిన వీబీఆర్ ముట్టడి కార్యక్రమానికి 500 ట్రాక్టర్లతో రైతులు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు అంబాల ప్రభాకర్‌రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి దేశం తిరుపంరెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఇలియాస్‌ఖాన్, మాజీ సర్పంచ్ వేల్పుల జయపాల్, రైతు విభాగం నాయకుడు వంగాల నాగేశ్వరరెడ్డి, గోవిందు, షంషీర్ అలీఖాన్, తదితరులు పాల్గొన్నారు.
10 టీఎంసీల నీరు ఉన్నా
ఎందుకివ్వరు?
ఎమ్మెల్యే బుడ్డా.. నోరు మెదపరెందుకు
రైతులతో 1న వీబీఆర్ ముట్టడి
మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి


