ఆత్మకూరురూరల్: ఆత్మకూరు అటవీశాఖ డీడీ కార్యాలయంలో కోట్లాది రూపాయల ప్రభుత్వ సొమ్మును దారి మళ్లించిన కేసును సీబీసీఐడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది. ఇటీవల అటవీ శాఖ ప్రిన్సిపల్ ఛీప్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ చలపతిరావు ఈ మేరకు కేసును బదలాయించమని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. ఆయన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న అటవీ పర్యావరణ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి కాంతిలాల్ దండే.. సీబీసీఐడీకి ఈ కేసును బదిలీ చేశారు. ఇంతవరకు అటవీశాఖ అంతర్గత దర్యాప్తు ద్వారా ఈ కేసులో సుమారు రూ.11 కోట్ల ప్రభుత్వం ధనం తప్పుడు మార్గాల ద్వారా ఇతరుల జేబుల్లోకి వెళ్లినట్లు గుర్తించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఆత్మకూరు పోలీసులు ఈ కేసులో దర్యాప్తులో భాగంగా మరో ఇద్దరికి నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. ఇద్దరిలో ఒకరు ఆత్మకూరు డీడీ కార్యాలయంలో కాంట్రాక్ట్ ఉద్యోగి అని తెలుస్తోంది.
సీసీ కెమెరాలతో నిరంతర నిఘా
డోన్ టౌన్: సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో డోన్ పట్టణంలో నిరంతర నిఘా ఉంటుందని ఎస్పీ సునీల్ షెరాన్ తెలిపారు. స్థాని క డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అత్యాధునిక కమాండ్ కంట్రోల్ రూంను డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్‌రెడ్డితో కలిసి ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. నేరాల కట్టడికి ఆత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఎంతో ఉపయోగపడుతు ందన్నారు. డోన్ పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా, నిందితులను త్వరగా గుర్తించేందుకు 118 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. డోన్ లో బందోబస్తు కోసం డ్రోన్ టెక్నాలజీని కూడా వినియోగిస్తున్నట్లు చెప్పారు. పోలీసులు ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు ఈ డ్రోన్‌ను ఉపయోగించి పెట్రోలింగ్ చేస్తామన్నారు. డోన్ డీఎస్పీ శ్రీనివాస్, డోన్, ప్యాపిలి, బనగానపల్లె సీఐలు ఇంతియాజ్ బాషా, రాకేష్, వెంకట్రామిరెడ్డి ,ప్రవీణ్‌కుమార్, ఎస్‌ఐ శరత్‌కుమార్‌రెడ్డి, నరేంద్రకుమార్, మమత పాల్గొన్నారు.
● జిల్లా పరిషత్ చైర్మన్
యర్రబోతుల పాపిరెడ్డి
కర్నూలు(అర్బన్): స్వాతంత్య్ర పోరాటంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామారాజు చూపిన తెగువ, చేసిన పోరాటం, త్యాగం తెలుగుజాతి మరువలేనిదని జిల్లా పరిషత్ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి అన్నారు. శనివారం అల్లూరి సీతారామరాజు 129వ జయంతి సందర్భంగా స్థానిక జిల్లా పరిషత్‌లోని మినీ సమావేశ భవనంలో అల్లూరి చిత్రపటానికి ఆయన పూలమాల వేసి నివాళి అర్పించారు. జెడ్పీ ఇన్‌చార్జ్ సీఈఓ ఈవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పాపిరెడ్డి మాట్లాడుతూ.. తెలుగుజాతి పౌరుషాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహా వీరుడు అల్లూరి సీతారామరాజు అని చెప్పారు. ఆయన జీవిత చరిత్రను ప్రతి ఒక్కరు ఎల్లప్పుడు స్మరించుకోవాలన్నారు. జెడ్పీ ఇన్‌చార్జీ సీఈఓ ఈవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. 1897 జూలై 4న అల్లూరి సీతారామరాజు జన్మించారన్నారు. చిన్నతనం నుంచే దేశభక్తి భావాన్ని పెంపొందించుకున్న అల్లూరి బ్రిటీష్ పాలనకు వ్యతి రేకంగా ఆదివాసీల హక్కుల కోసం పోరాటం చేశారన్నారు. జెడ్పీ పరిపాలనాధికారులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
డిగ్రీ స్పెషల్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
కర్నూలు కల్చరల్: రాయలసీమ యూనివర్సిటీ పరిధిలో గత జూన్ 27న నిర్వహించిన డిగ్రీ స్పెషల్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. వర్సిటీ వైస్‌ఛాన్సలర్ ప్రొఫెసర్ వి.వెంకట బసవరావు ఆదేశాల మేరకు ఫలితాలు విడుదల చేసినట్లు వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఫలితాలు https://rayalseemauniversity.ac.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయన్నారు. ఐదవ సెమిస్టర్ బీఏ కోర్సుకు 74, బీబీఏ ఒకరు, బీసీఏ నలుగురు, బీకాం 143 మందికి 139, బీఎస్సీ 174 మందికి 170 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారన్నారు.


