భూములు కోల్పోయిన రైతులకు అన్యాయం చేస్తే ఊరుకోం | - | Sakshi
Sakshi News home page

భూములు కోల్పోయిన రైతులకు అన్యాయం చేస్తే ఊరుకోం

Jul 2 2026 12:47 PM | Updated on Jul 2 2026 12:47 PM

భూములు కోల్పోయిన రైతులకు అన్యాయం చేస్తే ఊరుకోం

నిజమైన రైతులకు నష్టపరిహారం అందాలి

పార్టీలకు అతీతంగా ఉద్యోగ అవకాశాలు కల్పించండి

తహసీల్దార్‌ను కోరిన కాటసాని రాంభూపాల్‌రెడ్డి

గడివేముల: సోలార్‌లో భూములు కోల్పోయిన రైతులకు కాకుండా అనర్హులకు నష్టపరిహారం అందిస్తే ఊరుకోబోమని వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి అన్నారు. గడివేముల మండలం చెనకపల్లె, గడిగరేవుల గ్రామాల పొలిమేరలో నిర్మిస్తున్న సోలార్‌ ప్రాజెక్టును బుధవారం కాటసాని పరిశీలించారు. నష్టపరిహారం అందించకుండా సోలార్‌ యాజమాన్యం ఇబ్బంది పెడుతోందని రైతులు చెప్పడంతో కంపెనీ ప్రాజెక్టు మేనేజర్‌ వెంకట్‌తో మాట్లాడారు. భూములు కోల్పోయిన రైతుల ఇంట్లో చదువుకున్న వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. ఒండుట్ల, పైబోగుల గ్రామాలకు చెందిన వారికి మొదటి ప్రాధాన్యతగా ఉద్యోగం, పనులు కల్పించాలన్నారు. రెండు గ్రామాల్లో ఉన్న యువకులకు, ప్రజలకు పార్టీలకు అతీతంగా కంపెనీలో ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. ఒకే పార్టీకి చెందిన వారికి మాత్రమే అవకాశం ఇచ్చి, ఇతర పార్టీలకు చెందిన వారికి అవకాశం కల్పించకపోతే వైఎస్సార్‌సీపీ ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తుందన్నారు. అనంతరం జిందాల్‌ సిమెంట్‌ ఫ్యాక్టరీని సందర్శించి రైతులను సమస్యలను ప్లాంట్‌హెడ్‌కు వివరించి వాటిని పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ కాలునాయక్‌, వైఎస్సార్‌సీపీ నాయకులు రవీంద్రారెడ్డి, అనిల్‌ కుమార్‌రెడ్డి, మేఽఘనాథరెడ్డి, అనంద్‌రెడ్డి, గని రాము, రఘమాధవరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, పరమేశ్వరరెడ్డి, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

నిజమైన రైతులకు పరిహారం ఇవ్వండి

సోలార్‌లో భూములు కోల్పోయిన నిజమైన రైతులకు పరిహారం అందించాలని తహసీల్దార్‌ వెంకటరమణను కాటసాని కోరారు. తహసీల్దార్‌ కార్యాలయంలో వివిధ సమస్యలపై తహసీల్దార్‌కు వివరించారు. మండలంలో ఉన్న రైతులకు మాత్రమే పరిహారం అందించాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, వివిధ జిల్లాలో ఉన్న వారికి పరిహారం ఎలా ఇస్తారని ప్రశ్నించారు. పరిహారం జాబితాలో అవకతవకలకు దారితీయకుండా చూడాలని తహసీల్దార్‌కు సూచించారు. పార్టీలు అతీతంగా పరిహారం అందేలా చూడాలన్నారు. అనర్హులకు పరిహారం అందిస్తే జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో పెద్దఎత్తున అందోళన చేస్తామన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు ఆర్‌బీ చంద్రశేఖరరెడ్డి, నాయకులు, రైతులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement