ఎస్సార్బీసీకి నిలిచిన నీటి సరఫరా
ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో రెండు ఎకరాల్లో మిరప, మరో ఆరు ఎకరాల్లో మొక్కజొన్న పంటలు సాగు చేశాను. మిరపలో ఇప్పటికే ఎకరాకు లక్షా యాభైవేల రూపా యలు, మొక్కజొన్నలో రూ. 35 వేలు వెచ్చించాను. మరో నాలుగు తడులు నీటిని మళ్లించాల్సి ఉంది. రెండు రోజుల నుంచి కాల్వలకు నీటిని నిలుపుదల చేశారు. – మహేశ్వరరెడ్డి, రైతు
అమడాల, కోవెలకుంట్ల మండలం
ఎస్సార్బీసీ నీటి ఆధారంగా సొంత పొలంలో 10 ఎకరాల్లో మొక్కజొన్న, నాలుగు ఎకరాల్లో కంది పంట సాగు చేశాను. నీటి సరఫరా ఆగిపోవడంతో పైర్లు ఎండిపోతున్నాయి. మరో రెండు నెలల నీరు ఇవ్వాలి. – జగదీశ్వరరెడ్డి, రైతు,
అమడాల, కోవెలకుంట్ల మండలం
కోవెలకుంట్ల: శ్రీశైలం కుడిగట్టు కాల్వలకు రెండు రోజుల నుంచి నీటి సరఫరా ఆగిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మార్చి నెలాఖరు వరకు కాల్వలకు నీటిని సరఫరా చేస్తామన్న అధికారులు రెండు నెలల ముందే అర్ధాంతరంగా నీటిని నిలిపివేయడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. బనగానపల్లె నియోజకవర్గంలోని కోవెలకుంట్ల, సంజామల, అవుకు, బనగానపల్లె మండలాల పరిధిలో ఎస్సార్బీసీ 7వ బ్లాక్ నుంచి 13వ బ్లాక్ వరకు మెయిన్ కెనాల్, డిస్ట్రిబ్యూటరీ కాల్వల ద్వారా రైతులకు సాగు నీరు అందుతోంది. ఆ నీటి ఆధారంగా ఈ ఏడాది ఖరీఫ్, రబీ సీజన్‌లో మొక్కజొన్న, వరి, మినుము, మిరప, కంది, పెసర, తదితర పంటలు సాగు చేశారు. రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులు, కలుపునివారణ, సాగునీటి మళ్లింపు, తదితరాలకు పెట్టుబడుల రూపంలో ఎకరాకు రూ.25 వేల నుంచి రూ.35 వేలు వెచ్చించారు. మిరప రైతులు రూ. 1.50 లక్షల వరకు పెట్టుబడులు పెట్టారు. ప్రస్తుతం దిగుబడులు చేతికందే దశలో ఉన్నాయి. ఈ తరుణంలో అధికారులు కాల్వలకు నీటిని బంద్ చేయడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీటిసరఫరాను నిలిపివేస్తున్నట్లు అధికారులు ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం. పంటలకు మరో నాలుగు తడులు సాగునీరు అందితే తప్ప దిగుబడులు దక్కవని రైతులు వాపోతున్నారు.
ఎస్సార్బీసీకి నిలిచిన నీటి సరఫరా
ఎస్సార్బీసీకి నిలిచిన నీటి సరఫరా


