పేదలకు ఉచిత న్యాయ సేవలు
నందికొట్కూరు: న్యాయవాదులను ఏర్పాటు చేసుకోలేని ఆర్థిక స్థోమత లేని ఖైదీలకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఉచిత న్యాయవాది ఏర్పాటు చేస్తామని కర్నూలు జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ కార్యదర్శి, సీనియర్ సివిల్ జిల్లా జడ్జి లీలా వెంకటశేషాద్రి తెలిపారు. నందికొట్కూరులోని సబ్‌జైల్‌ను బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముద్దాయిలతో ముఖాముఖి న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. అనంతరం ఖైదీలకు ఆరోగ్య, వైద్య పరీక్షలు డాక్టర్ ప్రవీణ్ చేశారు. ఖైదీలను సమస్యలను సీనియర్ సివిల్ జడ్జి శోభారాణి, జూనియర్ సివిల్ జడ్జి దివ్య అడిగి తెలుసుకున్నారు. సబ్‌జైల్ ఇన్‌చార్జ్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్, న్యాయవాది మద్దయ్య పాల్గొన్నారు.
2న బ్రహ్మోత్సవాల సమన్వయ సమావేశం
శ్రీశైలం టెంపుల్: క్షేత్రంలో ఫిబ్రవరి 8 నుంచి 18వ తేదీ వరకు జరగనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఫిబ్రవరి 2న సమన్వయ సమావేశాన్ని నిర్వహించనున్నారు. సమావేశానికి ముగ్గురు మంత్రుల బృందం రానున్నారు. మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు అవసరమైన సౌకర్యాలపై ఇప్పటికే జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకు ఇప్పటి వరకు చేపట్టిన పనుల పురోగతిపై రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, హోంమంత్రి వంగలపూడి అనిత, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ హాజరై సమీక్షిస్తారు. అనంతరం క్షేత్ర పరిధిలో పర్యటించి భక్తుల సౌకర్యార్థం చేపట్టాల్సిన ఏర్పాట్లపై పలు ఆదేశాలు జారీ చేస్తారు.


