రూ. 20 లక్షలతో ఉడాయించిన రికవరీ ఏజెంట్లు
● న్యాయం చేయాలని కోటక్ బ్యాంక్ ఎదుట రైతుల ఆందోళన
నంద్యాల: రుణాల రికవరీ ఏజెంట్లు పని చేసే ముగ్గురు వ్యక్తులు రైతులను నట్టేట ముంచేశాడు. రైతులు బ్యాంక్‌కు చెల్లించిన కంతులను వసూలు చేసుకుని ఉడాయించారు. ట్రాక్టర్ల కొనుగోలు కోసం మహానంది, నంద్యాల, ఆళ్లగడ్డ, గోస్పాడు, బండిఆత్మకూరు తదితర ప్రాంతాలకు చెందిన దాదాపు 20 మంది రైతులు పట్టణంలోని శ్రీనివాసనగర్‌లో ఉన్న కోటక్ మహేంద్ర బ్యాంకు నుంచి దాదాపు రూ.లక్షల్లో రుణాలు తీసుకున్నారు. ఒక్కో కంతుకు రూ.75 వేల చొప్పున ఆరు కంతుల్లో చెల్లించేలా బ్యాంకు అధికారులతో ఒప్పందం కుదుర్చుకున్నారు. బ్యాంకు అధికారులు ఉదయ్‌కుమార్, అస్లాం, అనిల్‌లను రికవరీ ఏజెంట్లుగా నియమించుకున్నారు. వీరు రైతుల నుంచి కంతులు వసూళ్లు చేసి దాదాపు రూ. 20 లక్షలు బ్యాంకులో జమ చేయకుండా వ్యక్తిగత ఖాతాల్లోకి మళ్లించుకున్నారు. కంతులు చెల్లించకపోవడంతో బ్యాంకు అధికారులు రైతులకు నోటీసులు పంపారు. లోన్లు చెల్లిస్తున్నా నోటీసు లు ఎందుకు పంపారంటూ రైతులు శుక్రవారం బ్యాంకు మేనేజర్‌ను సంప్రదించారు. తీవ్ర ఒత్తిడిలు తెస్తూ తమవద్ద నుంచి రికవరీ ఏజెంట్లు లోన్ డబ్బులు కట్టించుకున్నారంటూ రైతులు మేనేజర్‌కు వివరించారు. అంతకు మునుపు సంబంధిత రికవరీ ఏజెంట్లను రైతులు ఫోన్ల ద్వారా సంప్రదించగా స్పందన లేకుండా పోయింది. రికవరీ ఏజెంట్లు థర్డ్ పార్టీ కాబట్టి వారితో సంబంధం లేదన్నారు. తీసుకున్నా లోన్ మొత్తాన్ని రైతులే చెల్లించాలంటూ బ్యాంకు అధికారులు బెదిరింపు ధోరణితో మాట్లాడటంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు బ్యాంకు షెట్టర్ మూసి నిరసన తెలిపారు. న్యాయం చేయాలంటూ వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.


