ఆక్రమణకు ‘పచ్చ’జెండా!
వాస్తవాలను పరిశీలిస్తాం
రిజిస్ట్రేషన్ చెల్లదు
ఎస్సార్బీసీ స్థలానికి రెక్కలు
‘లక్కీ’
భూదందా
అధికార పార్టీ నేతల భూ దందాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. ప్రభుత్వ స్థలమైనా సరే ఎంచక్కా రిజిస్ట్రేషన్ చేయించుకొని సొమ్ము చేసుకుంటున్నారు. ఓ మంత్రి అండదండలు ఉండటంతో అడిగిందే తడవుగా అధికారులు సైతం తల ఊపేస్తున్నారు. ఎలాంటి స్థలమైనా అప్పనంగా కట్టబెడుతున్నారు. ఆ తర్వాత స్థలాలను అమాయక ప్రజలకు విక్రయించి రూ.కోట్లు వెనకేసుకుంటున్నారు. అయితే ప్రభుత్వ స్థలాలను అమ్మినా, కొన్నా నేరమే కావడంతో.. ఎప్పటికై నా స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో స్థలాలు కొనుగోలు చేసిన ప్రజలు కూలీనాలీ చేసుకొని కూడబెట్టుకున్న డబ్బును కోల్పోయే పరిస్థితి ఏర్పడింది.
సాక్షి టాస్క్‌ఫోర్స్: గత కొంత కాలంగా బనగానపల్లె పరిసర ప్రాంతాల్లోని ఎస్సార్బీసీ స్థలాలు ఆక్రమణకు లోనవుతున్నా అధికారులు పట్టించుకోని పరిస్థితి. తాజాగా అధికార పార్టీ నేతల కన్ను కూడా ఆ స్థలాలపై పడింది. ఓ మంత్రి అండదండలు ఉండటంతో అధికారులు సైతం ‘పచ్చ’జెండా ఊపేశారు. ఉమ్మడి ఆదివుశేన్‌రెడ్డి కుమారుడు ఉమ్మడి హుస్సేన్‌రెడ్డి అవుకు రోడ్డు నుంచి రవ్వలకొండ వేళ్లే దారిలో జలాల్‌బాబా దర్గా ఎదుట ఎస్‌ఆర్‌బీసీకి చెందిన 151/2 పైకి సుమారు రూ.50 లక్షల విలువ చేసే 14 సెంట్ల స్థలాన్ని ఆక్రమించుకున్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ స్థలాన్ని ప్లాట్లుగా మార్చుకొని సొమ్ము చేసుకునేందుకు పథకం రచ్చించారు. లక్కీ డ్రాలను ప్రభుత్వం నిషేధించినా అడిగేవారు ఎవరని ‘అన్నపూర్ణ లక్కీ డ్రా’తో అమాయక ప్రజలను నిలువునా ముంచేస్తున్నారు.
‘పట్టా’గా రిజిస్ట్రేషన్
భానుముక్కలలోని సర్వే నంబర్ 151లో 13.45 ఎకరాలు ఉండగా మొత్తం విస్తీర్ణం ఎస్‌ఆర్‌బీసీ కాల్వ నిర్మాణానికి భూసేకరణ చేశారు. ఇందులో కాల్వ నిర్మాణం పూర్తయ్యాక మిగులు భూమి ఆక్రమణకు గురవుతోంది. రిజిస్ట్రేషన్‌కు 151 సర్వే నంబర్‌ను మండల తహసీల్దార్ కార్యాలయంలో మండల డిప్యూటీ సర్వేయర్ 151/1,151/2గా సబ్ డివిజన్ చేయడం గమనార్హం. ఇందులో 151/1ను ఎస్‌ఆర్‌బీసీ కెనాల్ భూసేకరణకు 151/2 పట్టాగా మార్పు చేశారు. ఆ తరువాత సబ్ రిజిస్టర్ కార్యాలయంలో 151/2 పైకి పేరిట 14 సెంట్లను టీడీపీ నేత ఉమ్మడి హుస్సేన్‌రెడ్డి రిజిస్ట్రేషన్ చేయించుకోవడం గమనార్హం.
వంత పాడిన అధికారులు
నిబంధనల ప్రకారం ఎస్‌ఆర్‌బీసీ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయకూడదు. ప్రభుత్వ భూమిని పట్టా భూమిగా మార్చడం రిజిస్టేషన్ చేయించడం నిబంధనలకు విరుద్ధం. మండల తహసీల్దార్ కార్యాలయంలో సబ్ డివిజన్ చేయడం కూడా నేరమే. కానీ మండల డిప్యూటీ సర్వేయర్ సబ్ డివిజన్ చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇలా అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఎక్కడికక్కడ నిబంధనలను తొక్కిపెట్టి స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇంత జరుగుతున్నా ఎస్సార్బీసీ, రెవెన్యూ, గ్రామ పంచాయతీ అధికారులు మాట మాత్రమైనా అడ్డుచెప్పకపోవడం గమనార్హం.
లక్కీడ్రాతో ప్లాట్ల విక్రయం
అన్నపూర్ణ లక్కీ డ్రా పేరిట ఎస్సార్బీసీ స్థలం విక్రయానికి బనగానపల్లె ప్రాంతంలో విస్తృత ప్రచారం జరుగుతోంది. బ్రోచర్లు ముద్రించి సోషల్ మీడియాలోనూ హోరెత్తిస్తున్నారు. ప్రథమ బహుమతిగా 2.5 సెంట్లు, రెండు నుంచి 5వ బహుమతి వరకు 2 సెంట్ల ఓపెన్ ప్లాట్.. 6వ బహుమతి 1.26 సెంట్లుగా నిర్ణయించారు. కూపన్ ధర రూ.999లుగా నిర్ణయించి 3,600 మంది సభ్యులను చేర్చుకుంటున్నారు. కూపన్లు మొత్తం విక్రయించిన తర్వాతనే లక్కీ డ్రా తీస్తామని బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. అప్రూవల్‌కు పంచాయతీ అనుమతి తప్పనిసరి. కానీ పంచాయతీ అప్రూవల్ ఉందని, వాటర్ సప్లయ్ కూడా ఉందంటూ బురిడీ కొట్టిస్తున్నారు.
ఎస్సార్బీసీ స్థలాన్ని ఆక్రమించుకున్న విషయం మా దృష్టికి రాలేదు. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకోవడం, రిజిస్ట్రేషన్ చేయించుకోవడం చట్ట ప్రకారం నేరం. ఈ విషయంలో వాస్తవాలను పరిశీలిస్తాం. ఆక్రమణకు గురైనట్లు తేలితే స్థలాన్ని స్వాధీనం చేసుకొని ఆక్రమణదారులపై చర్యలు తీసుకుంటాం.
– మల్లికార్జున ఈఈ ఎస్‌ఆర్‌బీసీ
భానుముక్కలకు చెందిన సర్వే నంబర్ 151 పూర్తి విస్తీర్ణం ప్రభుత్వ భూమి. ఈ భూమిని ఎట్టి పరిస్థితుల్లో రిజిస్ట్రేషన్ చేసేందుకు వీలుకాదు. రిజిస్ట్రేషన్ ఎలా జరిగిందో తెలుసుకుంటాం. ఈ వ్యవహారం గతంలోనే జరిగింది. అందువల్ల నాకు ఎలాంటి సమాచారం లేదు. ప్రభుత్వ భూమిని రిజిస్ట్రేషన్ చేస్తే చెల్లదు.
– విజయకుమార్
ఇన్‌చార్జి సబ్ రిజిస్ట్రార్, బనగానపల్లె
అడ్డదారుల్లో అధికార పార్టీ నేత
దురాక్రమణ
ఓ మంత్రి అండదండలతో
ఇష్టారాజ్యం
అడ్డుకోవాల్సిన సబ్ రిజిస్ట్రార్
అడ్డంగా సంతకాలు
రూ.50లక్షలకు పైగా విలువైన స్థలం
లక్కీడ్రా పేరిట అమాయక ప్రజలకు
కట్టబెడుతున్న వైనం
అధికారులకు తెలిసినా మౌనం
ఆక్రమణకు ‘పచ్చ’జెండా!
ఆక్రమణకు ‘పచ్చ’జెండా!


