తెలుగుగంగ ఉప కాల్వకు గండి
రుద్రవరం: మండల పరిధిలోని టీ.లింగదిన్నె పొలిమేరలోని 23వ బ్లాక్ తెలుగు గంగ ఉప కాల్వకు గండి పడి సాగు నీరంతా వృథాగా పోతోంది. అయినప్పటికీ ఆ గండి పూడ్చేందుకు అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. దీంతో సాగునీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. విషయాన్ని అధికారులకు చెప్పడంతో వారు అక్కడికి వచ్చి గండిని పరిశీలించి వెళ్లారే తప్ప పూడ్చేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని రైతులు తెలిపారు.
మీ ఇంటిని ఇలాగే ఉంచుతారా?
● ఉపాధ్యాయులపై
జిల్లా కలెక్టర్ ఆగ్రహం
నంద్యాల(న్యూటౌన్): ‘మీ ఇంటిని కూడా ఇలాగే ఉంచుతారా’ అంటూ ఉపాధ్యాయులపై జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆగ్రహం వ్యక్తం చేశారు. నంద్యాల పట్టణంలోని నందమూరినగర్‌లో ఉన్న జిల్లా పరిషత్ హైస్కూల్‌ను శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాల పరిసర ప్రాంతాలను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. పాఠశాలలో ప్రత్యేక మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉన్నాయని, బహిర్భూమికి బయటికి వెళ్తున్నామని విద్యార్థులు తెలిపారు. మూడు రోజుల నుంచి గుడ్లు ఇవ్వడం లేదని చెప్పారు. దీంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల హెచ్‌ఎంకు, ఎంఈఓకు షోకాజ్ నోటీస్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్‌కు ఉచిత శిక్షణ
కర్నూలు(అర్బన్): డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్టడీ సర్కిల్ ద్వారా యుపీఎస్‌సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షకు ఉచిత శిక్షణకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఎస్సీ సంక్షేమ సాధికారత అధికారిణి బి.రాధిక కోరారు. శిక్షణలో ఉచిత వసతి, ఆహారం, ప్రింటెడ్ స్టడీ మెటీరీయల్ అందిస్తామన్నారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌లో శిక్షణకు సంబంధించిన పోస్టర్లను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి ఆవిష్కరించారన్నారు. అభ్యర్థి తప్పనిసరిగా రెగ్యులర్ గ్రాడ్యుయేట్ అయి ఉండాలని, కుటుంబ వార్షిక ఆదాయం రూ.8 లక్షల లోపు ఉండాలన్నారు. అర్హులైన అభ్యర్థులు https://apstudycircle.apcfss.in వెబ్‌సైట్ ద్వారా ఈ నెల 26లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. 27వ తేది నుంచి హాల్‌టిక్కెట్స్ పొందవచ్చని, ఈ నెల 30న స్క్రీనింగ్ పరీక్ష నిర్వహిస్తామన్నారు. ఎంపికై న అభ్యర్థులకు డిసెంబర్ 10వ తేది నుంచి శిక్షణ ప్రారంభమవుతుందన్నారు. వివరాలకు 9493343866 నెంబర్‌ను సంప్రదించవచ్చన్నారు.
ప్రిన్సిపాల్ సస్పెన్షన్
కర్నూలు(అర్బన్): నగరంలోని గిరిజన బాలికల గురుకులంలో ఈనెల 16న అర్ధరాత్రి ఇద్దరు విద్యార్థినులు గోడ దూకి వెళ్లిన ఘటనకు సంబంధించి ప్రిన్సిపాల్ సలోమిని సస్పెండ్ చేసినట్లు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి బి.సురేష్ తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ విచారణ జరిపి నివేదికను రాష్ట్ర గిరిజన గురుకులాల కార్యదర్శికి పంపించగా ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు వచ్చాయన్నారు.


