ఆన్‌లైన్ లైంగిక దాడులను ఎదుర్కొందాం
కర్నూలు: పిల్లల ఆన్‌లైన్ భద్రత విధానాలు, సైబర్ క్రైమ్స్ తదితరాలపై చిల్డ్రన్స్ ఆఫ్ ఇండియా (సీఐఎఫ్) సౌజన్యంతో స్థానిక న్యాయ సేవాసదన్‌లో న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ధి సదస్సును ప్రారంభించి మాట్లాడారు. సమాజంలో ఆన్‌లైన్‌లో పిల్లలపై అనేక రకాలుగా లైంగిక దోపిడీలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వాటిని ఎదుర్కొని పిల్లలను రక్షించాలన్నది సదస్సు ముఖ్య ఉద్దేశమన్నారు. సైబర్ క్రైం సీఐ వేణుగోపాల్ మాట్లాడుతూ ఆన్‌లైన్‌లో జరిగే మోసాలను వివరిస్తూ వాటిని ఎలా ఎదుర్కోవాలనే విషయమై చర్చించారు. బెంగళూరు నుంచి వచ్చిన సీనియర్ ప్రోగ్రామ్ ఆఫీసర్ శుభ్రత్ కుమార్ మాట్లాడుతూ పిల్లలపై ఆన్‌లైన్‌లో జరిగే లైంగిక దోపిడీని ఎలా ఎదుర్కోవాలో వివరించారు. చైల్డ్ ప్రొటెక్షన్ డిపార్ట్‌మెంట్, జ్యువైనల్ జస్టిస్ బోర్డు మెంబర్స్, చిల్డ్రన్స్ వెల్ఫేర్, రెవెన్యూ, పోలీసు, ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ నుంచి ప్రతినిధులు సమావేశానికి హాజరయ్యారు. శాశ్విత లోక్ అదాలత్ చైర్మన్ వెంకట హరినాథ్, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు హరినాథ్ చౌదరి, కోఆర్డినేటర్ ఆఫ్ చిల్డ్రన్స్ ఆఫ్ ఇండియా ఫౌండేషన్ కేవీ కొండప్ప పాల్గొన్నారు.


