బీఈడీ కాలేజీలకు నోటీసులు
కర్నూలు సిటీ: రాయలసీమ యూనివర్సిటీ పరిఽధిలోని మూడు బీఈడీ కాలేజీలకు గురువారం నోటీసులు ఇచ్చారు. సాక్షి దినపత్రికలో ‘ఉన్నట్టు...కనికట్టు’ అనే శీర్షికన గురువారం కథనం ప్రచురితం కావడంతో వర్సిటీ అధికారులు ఈ మేరకు స్పందించారు. డోన్‌లోని శ్రీసుధా కాలేజీ ఆఫ్ ఎడ్యుకేషన్, గాయత్రి కాలేజీ ఆఫ్ ఎడ్యుకేషన్, పంచలింగాల గ్రామం చిరునామాతో ఉన్న బాలాజీ కాలేజీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే కాలేజీలకు నోటీసులు ఇచ్చారు. ఆ కాలేజీల యాజమాన్యాలు వర్సిటీ అధికారుల ఎదుట హాజరై వివరణ ఇచ్చారు. అయితే ఆర్‌యూ పరిధిలో కర్నూలు జిల్లాలో 10, నంద్యాల జిల్లాలో మరికొన్ని కాలేజీలకు భవనాలు లేకపోయినా అనుమతులు ఇచ్చారనే ఫిర్యాదులు వచ్చాయి. అయితే ఈ కాలేజీలకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని సమాచారం. ఈ విషయమై వర్సిటీ రిజిస్ట్రార్ బి.విజయకుమార్ నాయుడు మాట్లాడుతూ.. ప్రస్తుతం మూడు కాలేజీలకు నోటీసులు ఇచ్చామని, ఫిర్యాదులు వచ్చిన మిగిలిన కాలేజీలకు సైతం నోటీసులు ఇవ్వనున్నట్లు తెలిపారు.


