మేలైన వంగడాలతో అధిక దిగుబడులు
డోన్ టౌన్: రైతులు మేలైన వంగడాలను ఎంచుకోవడంతో పాటు ఆధునిక పద్ధతుల్లో ఉల్లి సాగు చేస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని ఢిల్లీ నుంచి వచ్చిన సెంట్రల్ టీం సభ్యులు అన్నారు. కామగానికుంట్ల గ్రామంలో సాగు చేసిన ఉల్లి పంటను బుధవారం వారు పరిశీలించారు. రైతులతో డిప్యూటీ కమిషనర్ డాక్టర్ బి.జే బ్రహ్మ, సెక్రటరీ మనోజ్, డిప్యూటీ డైరెక్టర్ రాజీవ్‌కుమార్, అసిస్టెంట్ డైరెక్టర్ హేమంగ్ భార్గవ్, గుంటూరు డీడీహెచ్ జమదగ్ని మాట్లాడారు. ఉల్లి సాగు చేసే విధానాలు, పెట్టుబడి ఖర్చులు, ఉత్పత్తి, దిగుబడుల వివరాలు తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఆధునిక పద్ధతులు పాటించాలని, నారుమళ్లను ఎత్తయిన మడుల్లో పెంచాలని సూచించారు. నీటి తడుల కోసం డ్రిప్ వాడాలని, సబ్సిడీ విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. వీరి వెంట కర్నూలు ఎన్‌హెచ్‌ఆర్డీఎఫ్ ఛీప్ శర్వానంద్, మహానంది ప్రిన్స్‌పల్ సెక్రటరీ ఠాగూర్‌నాయక్, జిల్లా ఉద్యానవనశాఖ అధికారి నాగరాజు, డోన్ ఉద్యానవనశాఖ అధికారి కళ్యాణి ఉన్నారు.


