కోటి కాంతుల కార్తీకం
● శ్రీశైలంలో వైభవంగా
కార్తీక కడ సోమవారం వేడుకలు
● దీపారాధన చేసి
ప్రత్యేక నోములు నోచుకున్న భక్తులు
● కనుల పండువగా లక్ష దీపోత్సవం,
పుష్కరిణికి దశవిధ హారతులు
లక్షదీపోత్సవంలో పాల్గొన్న భక్తులు
శ్రీశైలం టెంపుల్: శ్రీశైల మహా క్షేత్రంలో కార్తీక మాసోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. కార్తీక మాసం చివరి సోమవారం నిర్వహించిన లక్ష దీపోత్సవం, పుష్కరిణికి దశవిధ హారతులు కనుల పండువగా జరిగాయి. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తజనం వేకువజాము నుంచే పాతాళగంగలో పుణ్యస్నానాలాచరించుకుని శ్రీస్వామిఅమ్మ వార్ల దర్శనార్థమై బారులు తీరారు. భక్తుల రద్దీని దష్టిలో ఉంచుకుని వేకువజామున 4.30 గంటల దర్శనాలు ప్రారంభించారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులు ఆలయ ఉత్తర మాడవీధి, గంగాధరమండపం వద్ద కార్తీక దీపారాధన చేసుకుని ప్రత్యేక నోములు నోచుకున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అవసరమైన సంఖ్యలో లడ్డు ప్రసాదాలు సిద్ధం చేసి 10 కౌంటర్ల ద్వారా ప్రసాదాలు అందజేస్తున్నారు. కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా ఆలయ పుష్కరిణి వద్ద లక్షదీపోత్సం, పుష్కరిణిహారతిని శాస్త్రోక్తంగా నిర్వహించారు. పుష్కరిణి ప్రాంగణమంతా భక్తులు లక్షదీపాలు వెలిగించి పూజలు చేశారు. ముందుగా స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను పుష్కరిణి వద్ద ఉంచి విశేష పూజలు చేపట్టారు. అనంతరం దశవిధ హారతులు సమర్పించారు. ఆయా పూజల్లో శ్రీశైల దేవస్థాన ట్రస్టు బోర్డు చైర్మన్ పి. రమేష్ నాయుడు, ఈఓ శ్రీనివాసరావు, మండలి సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.
కోటి కాంతుల కార్తీకం


