● జిల్లా కలెక్టర్ రాజకుమారి
నంద్యాల: పీజీఆర్‌ఎస్‌లో వచ్చిన వినతుల పరిష్కారంలో జిల్లాలోని వివిధ శాఖల అధికారులు నిర్లక్ష్యం వీడాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాల్‌లో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ రాజకుమారి, డీఆర్‌ఓ రామునాయక్, ఎస్‌డీసీలు, డీఆర్‌డీఏ పీడీ తదితరులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. పీజీఆర్‌ఎస్‌లో వచ్చిన అర్జీలను నాణ్యతతో పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలన్నారు. అర్జీదారులకు ఇచ్చే ఎండార్స్‌మెంట్ వారికి అర్థమయ్యే విధంగా స్పష్టంగా ఉండాలన్నారు. అర్జీలు పెండింగ్ లేకుండా నిర్ణీత గడువు లోపల పరిష్కరించి రీ ఓపెన్‌కు తావు లేకుండా చూడాలన్నారు. జిల్లాలో భూ సమస్యలపై ఎక్కువగా అర్జీలు వస్తున్నాయని రెవెన్యూ అధికారులు భూ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించాలన్నారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు వివిధ సమస్యలపై 140 వినతులు అందజేశారు. ఈ సమస్యలన్నీ వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆయా శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.


