తెగిన ఆధారం
● చేనేత కార్మికులను పట్టించుకోని
చంద్రబాబు ప్రభుత్వం
● అమలుకాని 200 యూనిట్ల
ఉచిత విద్యుత్
కోవెలకుంట్ల: చేనేత కుటుంబాలకు నెలకు 200 యూనిట్లు, పవర్‌లూమ్స్‌కు నెలకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామని గత ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. అలాగే నేతన్నలకు 50 ఏళ్లకే ఫించన్ ఇస్తామని వాగ్దానం చేశారు. బాబు ప్రభుత్వం కొలువుదీరి ఏడాదిన్న దాటినా ఉచిత విద్యుత్ హామీ ఇప్పటి వరకు అమలు కాలేదు. జిల్లాలోని బనగానపల్లె, నంద్యాల, ఆళ్లగడ్డ, డోన్, శ్రీశైలం, నందికొట్కూరు నియోజకవర్గాల పరిధిలోని ఆయా గ్రామాల్లో అధిక సంఖ్యలో చేనేత కుటుంబాలు ఆ వృత్తిని నమ్ముకుని జీవనం సాగిస్తున్నాయి. వీరంతా హ్యాండ్‌లూమ్, పవర్‌లూమ్ మగ్గాల ఆధారంగా వివిధ రకాల చీరెలు నేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వీరందరూ 200 యూనిట్లు ఉచిత విద్యుత్ పొందేందుకు అర్హులు. కానీ ఇప్పటి వరకు ఒక్క కుటుంబానికి ఉచిత విద్యుత్ ప్రయోజనం దక్కలేదు. గత ప్రభుత్వంలో ఇస్తున్నట్లుగా 100 యూనిట్ల వరకు మాత్రమే ఉచిత విద్యుత్ వర్తిస్తోంది. ఆపై విద్యుత్ వినియోగానికి వందలాది రూపాయాలు విద్యుత్ బిల్లు వస్తోందని చేనేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
2014లో ఇదే తరహా మోసం
వర్షాకాలంలో చేనేత పరిశ్రమకు అంతరాయం కలుగుతున్నందున నెలకు రూ. 4 వేలు చెల్లిస్తామని, వంద యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని 2014 ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. వీటితోపాటు ఆరోగ్య ధీమా, చేనేత కార్మికులకు ఇళ్లు, షెడ్లు, పట్టణాల్లో జీ+3 భవనాలు అంటూ దాదాపు 18 రకాల హామీలు ఇచ్చారు. ఆ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సర్కార్ ఏ ఒక్క హామీ అమలు చేయకపోవడంతో అవి కేవలం కాగితాలకే పరిమితమయ్యాయి. టీడీపీ హయాంలో చేనేతలకు ఒక్క రూపాయికూడా మంజూరు చేయలేదు. టీడీపీ ప్రభుత్వ విధానాలతో చేనేత రంగం పూర్తిగా దెబ్బతినింది. అరకొర నిధులతో వీవర్స్ వెల్ఫేర్ ప్యాకేజీ అంటూ హడావిడి చేసి చేతులు దులుపుకుంది. ఆదరణపథకం కింద డబ్బులు కట్టించుకుని అరకొర సామగ్రి ఇచ్చి మమా అనిపించారు. నేతన్నలు తమను ఆదుకోవాలని ఎన్నిమార్లు విన్నవించుకున్నా పట్టించుకున్న పాపాన పోలేదు.
పింఛన్ పేరిట మోసం..
కష్టాలు ఇలా..
వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, అనంతపురం జిల్లా ధర్మవరం, తదితర ప్రాంతాల నుంచి పట్టు చీరలకు సంబంధించి దారం, ఇతర సామగ్రి తెచ్చుకుని నంద్యాల జిల్లాలో చేనేత కార్మికులు చీరెలు నేస్తున్నారు. వపర్‌లూమ్‌ద్వారా ఒక చీర నేసేందుకు ఒక రోజు, హ్యాండ్‌లూమ్ ద్వారా రెండు రోజుల సమయం పడుతోంది. చీర నేసినందుకు రోజుకు రూ. 900 కూలీ వస్తోందని, ఈ మొత్తం ఏ మాత్రం సరిపోవడం లేదని వాపోతున్నారు. ప్రభుత్వం చేనేతలను అన్ని విధాలా ఆదుకోవాలని వారు కోరుతున్నారు.
వైఎస్సార్‌సీపీ హయాంలో..
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం ద్వారా చేనేతల కుటుంబాలకు అండగా నిలిచింది. ప్రతి ఏటా రూ. 24వేలు ఆర్థికసాయం అందజేస్తూ ఆ కుటుంబాల్లో వెలుగులు నింపింది. నంద్యాల జిల్లాలోని 29 మండలాల పరిధిలో 848 చేనేత కుటుంబాలకు ప్రతి ఏటా లబ్ధి చేకూరింది. కుదేలైన చేనేత పరిశ్రమకు పునర్జీవం పోసేందుకు అప్పటి ప్రభుత్వం 2019 డిసెంబర్ 21న నేతన్న నేస్తం పథకాన్ని ప్రారంభించింది. కరోనా లాక్‌డౌన్ సమయంలో ఆర్డర్లు లేక దిక్కు తోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్న చేనేత కార్మికులకు వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం అండగా నిలిచింది. ఐదు విడతల్లో జిల్లాలోని ఒక్కో చేనేత కుటుంబం రూ. 1.20 లక్షల సాయం అందుకుంది. ఐదు విడతల్లో చేనేతలకు రూ. 10.17 కోట్లు ఆర్థికసాయం అందింది. ఈ సాయంతో నేతన్నలు ఫెడల్ లూమ్స్, నూతన డిజైన్లు ఇచ్చే జక్కార్డ్‌లు, బాబిన్లు, కొనుగోలుతో వృత్తిని సాంకేతికంగా మార్పు చేసుకుని అభివృద్ధి పథకంలో పయనించారు.


