● మోంథా తుపాన్ నష్టంపై ప్రభుత్వం కాకి లెక్కలు ● పంట న
బండిఆత్మకూరులో నేలకొరిగిన వరిపైరు
ఎకరాకు 18 బస్తాల కౌలుతో ఈ ఏడాది ఖరీఫ్ కింద 12 ఎకరాల్లో వరి సాగు చేశా. దాదాపు ఎకరాకు రూ. 30 వేల నుంచి 35 వేల పెట్టుబడులు అయ్యాయి. కంకి దశలో కళకళలాడుతున్న పంటను మోంథా తుపాన్ ముంచింది. పంట మొత్తం నేలకొరిగి ధాన్యం చేతికొచ్చే పరిస్థితి కనిపించలేదు. పంట నష్టం అంచనాలకు వచ్చిన అధికారులు తమ పొలాన్ని చూడకుండానే వెళ్లిపోయారు. పెట్టుబడులు కూడా రాని పరిస్థితులు కనిపిస్తున్నాయి. పంట అంతా నీట మునిగినా అధికారులకు కనికరం కలుగలేదు. ప్రభుత్వం పేద రైతులను గుర్తించి న్యాయం చేయాలి.
– మాలీబాషా, కౌలు రైతు, కానాల గ్రామం, నంద్యాల(మం)
నంద్యాల(అర్బన్): మోంథా తుపాన్‌తో జిల్లాలో పంట నష్టం భారీగా చూపించిన ప్రభుత్వం.. పంట నష్టపరిహారం విషయం వచ్చేసరికి భారీగా కోత పెట్టింది. తుపాన్ వచ్చిన రెండు వారాల తర్వాత ఎన్యుమరేషన్ చేస్తే మునిగిన పంటలో నీరు అంతా బయటకు పోతుంది. అలా పంటలో నుంచి నీరు పోతే దాన్ని పంట నష్టంగా పరిగణలోకి తీసుకోవడం లేదు. దీంతో పంట నష్ట పరిహారంలో చంద్రబాబు సర్కార్ కోత విధించింది. జిల్లాలో మోంథా తుపాన్ వల్ల మొత్తం 22,554 మంది రైతులకు చెందిన 28,620 ఎకరాల్లో సాధారణ పంటలు, మరో 1,126 మంది రైతులకు చెందిన 1,445 ఎకరాల్లో ఉద్యానవన పంటలకు నష్టం జరిగినట్లు అధికారుల లెక్కలు తేల్చారు. దీనిలో వరి 15,960 ఎకరాలు, మొక్కజొన్న 10,737, మినుము 1170, పత్తి 507 ఎకరాల్లో సాధారణ పంటలు నష్టం వాటిల్లినట్లు, ఉద్యానవన పంటలకు సంబంధించి 500 ఎకరాల్లో ఉల్లి, 425 ఎకరాల్లో మిరప, 175 ఎకరాల్లో బొప్పాయి పంటలు నష్టపోయినట్లు గుర్తించారు. సోషల్ ఆడిట్ అనంతరం ఈ నివేదికను ఉన్నతాధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి పంపినట్లు సమాచారం. అధికారులు గుర్తించిన మేరకు హెక్టారుకు రూ.25 వేలు చొప్పున 11,448 హెక్టార్లకు దాదాపు రూ.28.62 కోట్లు ప్రభుత్వం ఇన్‌పుట్ సబ్సిడీగా ఇవ్వనుంది. దీని వల్ల రైతులకు ఎంత మాత్రం ఉపయోగం లేదు.
బాబు సర్కార్ కాకి లెక్కలు..
కష్టాల్లో ఉన్న అన్నదాతలను ఉదారంగా ఆదుకోవాల్సిన ప్రభుత్వం వారి నోట్లో మట్టి కొట్టేందుకు ఎన్యుమరేషన్‌ను మమ అనిపించింది. రైతులను ఆదుకునేందుకు పారదర్శకంగా ఎన్యుమరేషన్ చేయాలని యంత్రాంగం ఎంతగా శ్రమించినా స్థానిక టీడీపీ నేతల కనుసన్నల్లోనే తుది జాబితాలు తయారు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. మోంథా తుపాన్ వెలసిన తర్వాత మొదట 64,720 ఎకరాలు, రెండో సారి 96,965 ఎకరాలు పంట నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా తయారు చేశారు. అయితే స్థానిక నేతల ఒత్తిళ్లు, ప్రభుత్వం పంట నష్టం అంచనాను తగ్గించాలన్న ఆదేశాలతో చివరకు 28,620 ఎకరాల్లో మాత్రమే పంట నష్టం జరిగినట్లు నివేదికలు పంపారు. ఉద్యానవన పంటలకు సంబంధించి 25వేల ఎకరాల్లో పంట నష్టం జరగగా 1,445 ఎకరాల్లో మాత్రమే పంట నష్టం జరిగినట్లు అంచనాలు తయారయ్యాయి.


