మెడికల్ కాలేజీలకు చంద్రగ్రహణం
వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నేడు నిరసన ర్యాలీలు
చంద్రబాబు సర్కారు కుట్రను ప్రజల్లోకి తీసుకెళ్లిన వైఎస్సార్‌సీపీ
మొన్న విద్యుత్ బిల్లులపై జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు
నిన్న గిట్టుబాటు ధర, యూరియా కొరతపై రైతులతో నిరసనలు
విద్యార్థులతో కలసి నేడు ‘ప్రజా ఉద్యమం’
నంద్యాల ప్రభుత్వ మెడికల్ కళాశాల
బొమ్మలసత్రం: వైద్య విద్య కలలను కూల్చేలా.. మెరుగైన వైద్యాన్ని దూరం చేసేలా.. కుట్ర పన్నిన చంద్రబాబు సర్కారుపై విద్యార్థి లోకం కదంతొక్కేందుకు సిద్ధమైంది. నూతన ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ ప్రజా ఉద్యమానికి పిలుపునిచ్చింది. రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా పాలన కొనసాగిస్తున్నప్పటి నుంచి పేదలు ప్రతి రోజు దోపిడీకి గురవుతూనే ఉన్నారు. అధిక విద్యుత్ బిల్లుల భారంతో జనం, మద్దతు ధర అందక రైతులు, ఫీజు రీయింబర్స్‌మెంట్ జాప్యంతో విద్యార్థులు.. సంక్షేమ పథకాలు అందక పేదలు.. ఇలా అందరూ బాబు ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మెడికల్ కాలేజీల ద్వారా విద్య, ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలు తెచ్చా రు. వాటిని కూడా బాబు సర్కార్ ప్రైవేటీకరణ పేరు తో దూరం చేసే కుట్ర చేయడంతో అడ్డుకునేందుకు ఇప్పటికే కోటి సంతకాల కార్యక్రమంతో వైఎస్సార్‌సీపీ ప్రజలను చైతన్యం చేసింది. ఈ క్రమంలోనే వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు అన్ని నియోజకవర్గాల్లో బుధవారం ‘ప్రజా ఉద్యమం’ పేరుతో నిరసన ర్యాలీలు చేపట్టనున్నారు. పార్టీలకతీతంగా విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజాసంఘాలు, మేధావులు, సామాజిక కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ర్యాలీల్లో పాల్గొననున్నారు.
కోటి సంతకాల సేకరణ విజయవంతం..
చంద్రబాబు ప్రజా వ్యతిరేక పోకడలను నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన కోటి సంతకాల సేకరణ జిల్లాలో విజయవంతంగా పూర్తయింది. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయొద్దంటూ చంద్రబాబు నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రజలు స్వచ్ఛందంగా కోటి సంతకాల సేకరణ శిబిరాల వద్దకు వెళ్లి సంతకాలు చేశారు. మరో వైపు చంద్రబాబుతో పాటు కూటమి నేతలు మెడికల్ కళాశాలు నిర్మాణాలు మొదలు కాలేదని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న తరుణంలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు కళాశాలల వద్దకు చేరుకుని ప్రభుత్వ తీరును ఎండగట్టారు. చంద్రబాబు గత 17 నెలల పాలనలో చేసిన రూ. 2.50 లక్షల అప్పులో రూ. 5 వేల కోట్లు ఖర్చు చేయలేమని చేతులెత్తేయటం దారుణమని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే పేదలకు సేవలందిస్తున్నాయి. ప్రజలకు మెరుగైన వైద్యంతో పాటు పేదల వైద్య విద్య కలను సాకారం చేసేందుకు గత ప్రభుత్వంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 17 నూతన మెడికల్ కాలేజీలను రాష్ట్రానికి తీసుకొచ్చారు. వాటిలో ఐదింటిని ప్రారంభించటమే కాకుండా 750 మెడికల్ సీట్లను ప్రభుత్వం అదనంగా విద్యార్థులకు అందించింది. ప్రారంభమైన కళా శాలలో నంద్యాల కాలేజీ ఉండటం విశేషం. 2022లో 150 మెడికల్ సీట్ల భర్తీ కోసం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో కళాశాల తరగతులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం 3వ విద్యా సంవత్సరం నడుస్తోంది. ఎంతో మంది జిల్లాతో పాటు చుట్టు పక్కల ప్రాంతాలకు చెందిన విద్యార్థులు చెంతనే వైద్య విద్యను అభ్యసిస్తునార్రు. అయితే మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన చంద్రబాబు మెడికల్ కాలేజీ పనులను అడ్డుకున్నారు. కళాశాల నిర్మాణం పూర్తయి తరగతులు ప్రారంభమైతే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి పేరుస్తుందనే అక్కసుతో వాటిని ప్రైవేటీకరణకు కుట్ర పన్నారు. చంద్రబాబు కక్షపూరిత విధానాల ద్వారా రెండేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 2,450 ఎంబీబీఎస్ సీట్లను కోల్పోవాల్సిన దుస్థితి నెలకొంది. రాష్ట్రంలో 10 మెడికల్ కాలేజీల నిర్వాహణ ప్రైవేటు వ్యక్తులకు కట్టబడితే పేద విద్యార్థులకు వైద్య విద్య కలగా మిగిలిపోనుంది.
మెడికల్ కాలేజీలకు చంద్రగ్రహణం


