● వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాం
కర్నూలు (టౌన్): ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు బుధవారం నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించే నిరసన ర్యాలీలను పార్టీ శ్రేణులు, విద్యార్థులు విజయవంతం చేయాలని వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి పిలుపు నిచ్చారు. మంగళవారం ఆయన తన స్వగృహంలో విలేకరులతో మాట్లాడుతూ.. 17 నెలల చంద్రబాబు పాలనలో అన్ని వర్గాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయన్నారు. ఎన్నికల ముందు సూపర్ సిక్స్ పేరుతో ప్రజలకు ఇచ్చిన హామీలను నేరవేర్చడంలో చంద్రబాబు నాయుడు ఘోరంగా విఫలమయ్యారన్నారు. సకాలంలో పెట్టుబడి నిధులు, ఎరువులు, విత్తనాలు ఇవ్వకుండా రైతులను నిలువునా మోసం చేశారన్నారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, మహిళలకు రూ.1500 ఇప్పుడిస్తారో చంద్రబాబు ప్రజలకు సమాధానం ఇవ్వాలన్నారు.
జగనన్న చేపట్టిన వైద్య కళాశాలల నిర్మాణాన్ని సీఎం చంద్రబాబు ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్నారని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పూర్తి చేసి పేదలకు అందుబాటులోకి తేవాల్సిన వ్యక్తి కక్షపూరితంగా వ్యవహరిస్తూ పీపీపీ విధానం పేరుతో ప్రైవేటీకరణకు పూనుకోవడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రభుత్వ వైద్య కళాశాలల విషయంలో వెనకడుగు వేయకపోతే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామన్నారు. ఇప్పటికే పార్టీ ఆధ్వర్యంలో జిల్లాలో చేపట్టిన కోటి సంతకాల సేకరణకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందన్నారు. అదే స్ఫూర్తితో బుధవారం కల్లూరు చెన్నమ్మ సర్కిల్ నుంచి కల్లూరు తహసీల్దార్ కార్యాల యం వరకు పార్టీ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పార్టీ నాయకులు, అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజా సంఘాలు పాల్గొని విజయవంతం చేయా లని పిలుపునిచ్చారు.


