
ఉపాధిలో అక్రమాలకు ‘ఫొటో’ చెక్!
నంద్యాల(అర్బన్): మహాత్మాగాంఽధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అక్రమ హాజరు నమోదుకు కేంద్ర ప్రభుత్వం చెక్ పెట్టింది. ఉపాధి సిబ్బంది, టీడీపీ నాయకులు కలసికట్టుగా అవినీతి చేయలేరు. కూలీల హాజరు నమోదుపై ఇటీవల కేంద్ర ప్రభుత్వం సరికొత్త యాప్‌ను తీసుకురావడంతో అక్రమాలకు అడ్డుకట్ట పడింది. జాబ్‌కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరి ఫొటోలను ఈ యాప్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. దీంతో సదరు ఉపాధి వేతనదారు పనికి వచ్చిన అనంతరం అతని ఫొటో(ఐరిస్) తీస్తారు. ఒకవేళ యాప్‌లో నమోదు చేసిన వ్యక్తి ఫొటోకు మ్యాచ్ అవ్వకుంటే నగదు చెల్లింపులు చేసేందుకు వీలుండదు. ఈ యాప్‌ను ఇటీవల క్షేత్రస్థాయిలో ప్రవేశ పెట్టింది. దీంతో మండల స్థాయిలో ఉండే ఉపాధి అధికారులు తమ పరిధిలోని ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లుకు శిక్షణ ఇస్తున్నారు. అలాగే ఉపాధి ఏపీవోలు పని జరిగే ప్రాంతాల్లో కూలీలకు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తెలియజేసేలా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు.
ఒకరు తరఫున మరొకరు హాజరైతే!
జిల్లాలో 2,65,737 జాబ్ కార్డులు ఉండగా 5,00,513 మంది కూలీలుగా నమోదయ్యారు. యాక్టివ్ కార్డులు 2,15,195 ఉండగా 3,82,050 మంది పనులకు హాజరయ్యేవారు. ఎన్నికల అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఫీల్డ్ అసిస్టెంట్లును తొలగించి తమ వారిని నియమించుకుంది. ముఖ ఆధారిత హాజరు విధానంలో భాగంగా కూలీల ఫొటోలను సెల్‌ఫోన్లలో తీసుకుని జాతీయ మొబైల్ పర్యవేక్షణ వ్యవస్థకు (ఎన్‌ఎంఎంఎస్)కు అనుసంధానం చేయాల్సి ఉంటుంది. పని ప్రదేశంలో ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ఫీల్డ్ అసిస్టెంట్లు పనిచేసే కూలీల ఫొటోలను తీసి అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ సమయంలో ఒకరు తరఫున మరొకరు హాజరైనట్లు చూపితే ఆన్‌లైన్‌లో హాజరు తీసుకోదు. దీంతో అటు ఉపాధి సిబ్బందికి, ఇటు కూటమి నాయకుల జేబులు నింపుకునే విధానానికి పెద్ద గండి పడినట్లు అవుతుంది.
పకడ్బందీగా పర్యవేక్షణ
ఎన్‌ఎంఎంఎస్ యాప్‌లో మేట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు తీసిన ఉపాధి కూలీల అటెండెన్స్ ఫొటోలన్నింటినీ ప్రతిరోజు పంచాయతీ కార్యదర్శి వెరిఫై చేసి రిపోర్టును ఎంపీడీఓలకు పంపించాల్సి ఉంది. మేట్, ఫీల్డ్ అసిస్టెంట్‌కు సంబంధం లేని ఫొటోను అప్‌లోడ్ చేశారా.. పని ప్రదేశంలో లైవ్ ఫొటో కాకుండా పాతది పెట్టారా... ఫొటోలో ఉన్న వ్యక్తుల సంఖ్య, మస్టర్‌లో హాజరైన వ్యక్తుల సంఖ్యలో తేడా ఉందా అన్న వివరాలు గమనించాలి. మండల స్థాయిలో అన్ని గ్రామాల నుంచి ఒక రోజులో వచ్చిన మొత్తం ఫొటోల్లో కనీసం 20 శాతం లేదంటే గ్రామానికి రెండు ఫొటోల చొప్పున ఎంపీడీఓ కార్యాలయంలోని ఏపీఓ, కాంట్రాక్ట్ స్టాఫ్, పర్మినెంట్ స్టాఫ్ అదే రోజు పరిశీలించి నివేదికను కలెక్టర్, డీఆర్‌డీఓలకు పంపించాలి.
ఫొటో ఉంటేనే హాజరు
కూలీలు పనులు చేసే ప్రదేశంలో ఉదయం, సాయంత్రం రెండు పూటలా రెండు ఫొటోలు తీసి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలి. అప్పుడే వారికి వేతనం వస్తుంది. ఫొటో ఉంటేనే హాజరుగా పరిగణనలోకి తీసుకుంటారు. ఫొటోలు అప్‌లోడ్ చేయకపోతే కూలీలకు వేతనం రాదు. ఈజీఎస్‌లో అక్రమాలకు చెక్ పెట్టేందుకే గత నెలలో నూతన విధానాన్ని కేంద్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చింది.
– సూర్యనారాయణ, జిల్లా డ్వామా పీడీ, నంద్యాల
ఇకపై రెండు ఫొటోలు దిగితేనే వేతనం
ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తేనే
కూలీ మంజూరు
జిల్లాలో 2.05 లక్షల జాబ్ కార్డులు
ఉత్తర్వులు జారీ చేసిన
కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ
4 గంటల తర్వాతే ఫొటో అప్‌లోడ్
పని ప్రదేశంలో మొదటి ఫొటోను ఉదయం 6 గంటలకు తీసి అప్‌లోడ్ చేస్తే, అనంతరం 4 గంటల తర్వాత అనగా ఉదయం 10 గంటలకు ఫోన్‌లో మరోసారి ఫొటో అప్‌లోడ్ చేయాలని సిగ్నల్ వస్తుంది. ఆ తర్వాత ఫొటో అప్‌లోడ్ చేయకపోతే ఆరోజు కూలీలకు నగదు చెల్లింపులు ఉండవు. మూడు నెలలుగా వేతనదా రులకు నగదు చెల్లింపులు చేయలేదు. కేంద్ర ప్రభుత్వం నగదును విడుదల చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వాటిని పక్కదారి పట్టించింది. అయితే త్వరలో కొత్త విధానం ప్రారంభమవ్వనున్న నేపథ్యంలో తమకు రావాల్సిన మూడు నెలలు వేతనాల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు.

ఉపాధిలో అక్రమాలకు ‘ఫొటో’ చెక్!