
రూ.82.79 కోట్ల ఉచిత పంటల బీమా విడుదల
కర్నూలు(అగ్రికల్చర్): వైఎస్సార్‌సీపీ ప్రభు త్వం అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకం కింద ఒక్క రూపాయి ప్రీమియం చెల్లించకుండానే మరోసారి రూ.82.79 కోట్ల ప్రయోజనం కలిగింది. 2022 ఖరీఫ్, 2023 ఖరీఫ్, 2023–24 రబీ, 2024 ఖరీఫ్ పంటలకు సంబంధించి ఉచిత పంటల బీమా ద్వారా రైతుల బ్యాంకు ఖాతాలకు ఈ మొత్తం గత రెండు రోజులుగా విడుదలవుతోంది. ఈ పరిహారం కేవలం కేంద్ర ప్రభుత్వ వాటా మాత్రమే. కేంద్రం ద్వారా ఒక్కో రైతుకు రూ.5 వేల నుంచి రూ.30 వేల వరకు ప్రయోజనం చేకూరుతోంది. వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం రైతుల నుంచి ప్రీమియం రూపంలో ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఉచిత పంటల బీమాను అమలు చేసింది. నోటిఫై చేసిన పంటలు ఈ–క్రాప్‌లో నమోదైతే చాలు బీమా వర్తింపజేయడంతో లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతోంది. ఉచిత పంటల బీమాను మరచిపోయిన రైతుల బ్యాంకు ఖాతాలకు బీమా పరిహారం విడుదలవుతుండటంతో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన మేలును గుర్తు చేసుకుంటున్నారు. ఇదిలాఉంటే రాష్ట్ర ప్రభుత్వం తమ వాటా పరిహారం విడుదల చేయడంలో చేతులెత్తేసింది. దీన్నిబట్టి చూస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రైతులపై ఉన్న అభిమానం ఏపాటిదో అర్థమవుతోంది.
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమలు చేసిన పథకం
కేంద్రం వాటా బీమా నిధులు విడుదల
చేతులెత్తేసిన కూటమి ప్రభుత్వం