వేసవి క్రీడా శిక్షణ శిబిరాలకు కిట్ల పంపిణీ | - | Sakshi
Sakshi News home page

వేసవి క్రీడా శిక్షణ శిబిరాలకు కిట్ల పంపిణీ

May 15 2025 1:58 AM | Updated on May 15 2025 3:21 PM

నంద్యాల(న్యూటౌన్‌): వేసవి క్రీడా శిక్షణ శిబిరాలకు అవసరమైన కిట్లను పంపిణీ చేశామని జిల్లా కలెక్టర్‌ రాజకుమారి తెలిపారు. జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం, శాప్‌ ఆధ్వర్యంలో 50 వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నారన్నారు. ఈ శిబిరాల్లో 8 నుంచి 14 సంవత్సరాల మధ్య ఉన్న విద్యార్థులకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నారన్నారు. ప్రతి శిక్షణ శిబిరానికి రూ. 5 వేల విలువ చేసే క్రీడా కిట్లు ఇచ్చామన్నారు. క్యాంపు ఇన్‌చార్జ్‌ కు గౌరవ వేతనం రూ.1,500, క్యాంపు నిర్వహణకు రూ. 500 చొప్పున మొత్తంగా 50 క్రీడా శిక్షణ శిబిరాలకు రూ.3.50 లక్షలు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. శిబిరాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక శిక్షణ ఇస్తారన్నారు. జిల్లా క్రీడా అభివృద్ధి శాఖ అధికారి ఎంఎన్‌వీ రాజు, శిక్షకులు, క్యాంపు కోచ్‌లు పాల్గొన్నారు.

265 మంది విద్యార్థుల గైర్హాజరు

నంద్యాల(న్యూటౌన్‌): జిల్లాలో బుధవారం నిర్వహించిన ఇంటర్మీడియెట్‌ సప్లిమెంటరీ పరీక్షలకు 265 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీఐఈఓ సునీత తెలిపారు. ఉదయం జరిగిన పరీక్షలకు మొదటి సంవత్సరం విద్యార్థులు 7,071 మందికి గాను 6,852 మంది హాజరు కాగా 219 మంది గైర్హాజరయ్యారన్నారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షలకు రెండో సంవత్సరం విద్యార్థులు 1,407 మందికి గాను 1,361 మంది హాజరు కాగా 46 మంది గైర్హాజరయ్యారన్నారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు.

విజిబుల్‌ పోలీసింగ్‌కు ప్రాధాన్యం

బొమ్మలసత్రం: నేరనివారణ లక్ష్యంగా విజిబుల్‌ పోలీసింగ్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఎస్పీ అధిరాజ్‌ సింగ్‌ రాణా తెలిపారు. గడిచిన 48 గంటల్లో మద్యం సేవించి వాహనాలు నడిపిన 38 మందిపై, బహిరంగంగా మద్యం సేవించిన 136 మందిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. నైట్‌బీట్లలో భాగంగా ప్రతిరోజు సిబ్బంది వారి పరిధిలో గస్తీ నిర్వహిస్తున్నారని, అనుమానితుల వివరాలు సేకరించి వారి వేలిముద్రలు తీసుకుని దొంగతనాలు, అల్లర్లు, గొడవలు జరుగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. గడిచిన 48 గంటల్లో ర్యాష్‌ డ్రైవింగ్‌ చేసిన 599 మంది పై రూ.4.62 లక్షల జరిమానా విధించామన్నారు. మద్యం సేవించి వాహనం నడుపుతున్న 38 మంది పై కేసులు నమోదు చేశామన్నారు.

టెండర్‌ దశలో డీఎంఎఫ్‌, నాబార్డు పనులు

కర్నూలు(అర్బన్‌): ఉమ్మడి కర్నూలు జిల్లాలో డీఎంఎఫ్‌(2024–25), నాబార్డు ఆర్‌ఐడీఎఫ్‌(2025–26) నిధులతో చేపట్టనున్న రోడ్ల పనులు టెండర్‌ దశలో ఉన్నాయని పంచాయతీరాజ్‌ పర్యవేక్షక ఇంజనీరు వి.రామచంద్రారెడ్డి తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రజలకు పూర్తి ఇబ్బందిగా ఉన్న రోడ్లను ఎంపిక చేసి ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించామన్నారు. ఈ నేపథ్యంలోనే కర్నూలు, నంద్యాల జిల్లాల్లో 29 రోడ్లు, ఒక బిల్డింగ్‌ పనికి సంబంధించి రూ.42.58 కోట్లతో పాలనా అనుమతులు వచ్చాయన్నారు. పనులను ప్రారంభించేందుకు ఈ నెల 9నుంచి 23వ తేది మధ్యాహ్నం 3.30 గంటల వరకు ఆన్‌లైన్‌లో టెండర్లు దాఖాలు చేసేందుకు సమయం ఇచ్చారన్నారు. టెండర్ల ప్రక్రియ ముగిసిన వెంటనే 23వ తేదీ సాయంత్రం 4.30 గంటలకు టెక్నికల్‌ బిడ్స్‌ను.. 26న ఉదయం 11 గంటలకు ఫైనాన్సియల్‌ బిడ్స్‌ను ఓపెన్‌ చేస్తామన్నారు. టెండర్‌ ప్రాసెస్‌ పూర్తయిన అనంతరం పనులను ప్రారంభించేందుకు చర్యలు చేపడతామన్నారు.

జాతీయ వైద్య కమిషన్‌ సభ్యులుగా డాక్టర్‌ చంద్రశేఖర్‌

కర్నూలు(హాస్పిటల్‌):జాతీయ వైద్య కమిషన్‌ మెడికల్‌ అడ్వయిజరీ కౌన్సిల్‌ సభ్యులుగా రాష్ట్రం తరపున కర్నూలుకు చెందిన డాక్టర్‌ పి.చంద్రశేఖర్‌ను నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే ఎన్‌టిఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌గా ఉన్న ఆయనకు జాతీయ వైద్య కమిషన్‌ సభ్యులుగా నామినేట్‌ చేయడం పట్ల స్థానిక వైద్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

వేసవి క్రీడా శిక్షణ శిబిరాలకు కిట్ల పంపిణీ 1
1/1

వేసవి క్రీడా శిక్షణ శిబిరాలకు కిట్ల పంపిణీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement