బాధిత రైతులకు న్యాయం చేయాలి
పాణ్యం: గత కొంత కాలంగా నెలకొన్న భూ సమస్యలను పరిష్కరించి బాధిత రైతులకు న్యాయం చేయాలని అధికారులకు వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి సూచించారు. పాణ్యంలోని పార్టీ కార్యాలయం వద్ద పిన్నాపురం, తమ్మరాజుపల్లె గ్రామాల రైతులతో బుధవారం చర్చించారు. ఈ సందర్భంగా కాటసాని మాట్లాడుతూ.. సోలార్ పరిశ్రమ వచ్చిన తర్వాత కొత్త ము ఖాలు ఆన్‌లోన్‌కి వచ్చాయని, ఈ విషయంపై అధికారులు క్షేత్ర స్థాయిలో రికార్డులను పరిశీలించాలన్నారు. ఇప్పటికే భూ సమస్యలపై అనేక సార్లు రెవెన్యూ అధికారులను కలిసి వినతి పత్రాలు ఇచ్చామన్నారు. ఇటీవల చాలా మంది పేర్లను రైతులుగా ఆన్‌లైన్‌లో చేర్చారని, క్షుణ్ణంగా విచారణ జరిపి నిజమైన అన్నదాతలను అధికారులు గుర్తించాలన్నారు.
కోర్టుకు వెళితే బెదిరింపులా?
పిన్నాపురంలో భూ సమస్యలపై రైతులు కోర్టుకు వెళితే వారిని అధికారులు, పోలీసులు బెదిరించడం ఏమిటని కాటసాని మండిపడ్డారు. కోర్టులో సమస్యలు పరిష్కారమవుతాయని, అంత వరకు అధికారులు సమన్వయం పాటించకుండా రైతులను బెదిరించే ధోరణితో మాట్లాడడం సరికాదన్నారు. కోర్టు తీర్పు ఆధారంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అధికారుల ఉత్సాహం ఎవరికి లాభం చేకూర్చడానికి అని ప్రశ్నించారు. ఈ విషయాన్ని త్వరలోనే బాధిత రైతులతో కలసి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు.
సాగునీటిపై ఆరా
ఎస్సార్బీసీ ఆయకట్టులో సాగు చేస్తున్న పంటలకు నీరు ఎలా అందుతుందనే విషయంపై రైతులతో కాటసాని మాట్లాడారు. చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందుతుందా లేదా అనే విషయంపై అడిగి తెలుసుకున్నారు. సాగునీటిని వృథా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎస్సార్బీసీ అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి కాల్వల సమస్యలను గుర్తించి మరమ్మతులు చేయాలన్నారు. మిరప, వరి తదితర పంటలకు మార్కెట్‌లో వస్తున్న ధర గురించి అడిగి తెలుసుకున్నారు. మాజీ సర్పంచ్ సుబ్బరాయుడు, కో–ఆప్షన్ సభ్యులు జాకీర్ ఉసేన్, ఆటోమాబు, చందమామ బాబు, తొడేటి సుబ్బయ్య, జయచంద్రారెడ్డి, క్రిష్ణారెడ్డి , మధురెడ్డి, చిన్న సుబ్బయ్య, బాలస్వామిరెడ్డి , పెద్ద ఎల్లసుబ్బయ్య, బాలిరెడ్డి, టైలర్‌బాషా తదితరులు పాల్గొన్నారు.
పిన్నాపురం, తమ్మరాజుపల్లెలో
భూ సమస్యలు పరిష్కరించాలి
వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా
అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి


