
భక్తులతో పోటెత్తిన పాతాళగంగ క్యూలైన్‌లో వేచి వున్న భక్తులు
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో వెలసిన శ్రీభ్రమరాంబామల్లికార్జున స్వామివార్ల దర్శనానికి భక్తులు పోటెత్తారు. కార్తీక మాసం చివరి వారం కావడంతో పరమేశ్వరుని దర్శనం కోసం భక్తులు తండోపతండాలుగా శ్రీగిరి చేరుకుంటున్నారు. దీంతో శ్రీశైలమహాక్షేత్రం భక్తజనసందోహంగా మారింది. కార్తీకమాసం చివరి ఆదివారాన్ని పురస్కరించుకుని ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం భక్తులు వేలాదిగా వచ్చారు. వేకువజామునే పాతాళగంగలో పుణ్యస్నానాలాచరించి కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి కృష్ణానదిలో దీపాలు వదిలారు. అనంతరం దేవస్థానం ఏర్పాటు చేసిన ఆలయ ఎదురుగా గంగాధర మండపం వద్ద ఆలయ ఉత్తరమాడ వీధిలోను కార్తీకదీపాలను వెలిగించి ప్రత్యేక పూజలు నోములు నోచుకున్నారు. అనంతరం మల్లన్న దర్శనానికి ఆలయ క్యూలైన్‌వద్ద బారులు తీరారు. భక్తులరద్దీతో ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలు నిండిపోయాయి. ఉచిత దర్శనానికి 4 గంటలు, ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పట్టింది.
