బాబుకు షాక్‌...ఇండిపెండెంట్ అభ్య‌ర్థిగా భూమా! | - | Sakshi
Sakshi News home page

నంద్యాల టికెట్‌ ఫరూక్‌కే .. నీతో అవసరం లేదు బ్రహ్మానందరెడ్డి: చంద్రబాబు

Nov 27 2023 1:56 AM | Updated on Nov 27 2023 1:35 PM

- - Sakshi

నంద్యాల: ఎన్నికలకు నాలుగైదు నెలలు సమయం ఉండగానే తెలుగుదేశం పార్టీలో టికెట్ల లొల్లి మొదలైంది. నంద్యాలలో ఈ పరిస్థితి తారాస్థాయికి చేరింది. రానున్న ఎన్నికల్లో నంద్యాలలో మాజీ ఎమ్మెల్యే, పార్టీ ఇన్‌చార్జ్‌ భూమా బ్రహ్మానందరెడ్డి, మాజీ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ బరిలో దిగేందుకు పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో వారిద్దరిని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇటీవల హైదరాబాద్‌లోని తన ఇంటికి పిలిపించుకుని మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో ఫరూక్‌కు టికెట్‌ ఇస్తున్నామని, సహకరించాలని భూమా బ్రహ్మానందరెడ్డికి చంద్రబాబు చెప్పారు. మొహం మీదే ఈ విషయం చెప్పేయడంతో భూమా వర్గీయులు టీడీపీ అధినేతపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ క్రమంలో భూమా బ్రహ్మానందరెడ్డి తన నివాసంలో అనుచరులు, పార్టీ నాయకులతో ఆదివారం సమావేశం నిర్వహించి మాట్లాడారు.

నాకు అన్యాయం జరుగుతుందని అనుకోలేదు
మాజీ మంత్రి ఫరూక్‌కు టికెట్‌ ఇస్తున్నాం.. నువ్వే గెలిపించాలి. నీకు మొదటి విడతలోనే ఎమ్మెల్సీ పదవి ఇచ్చి న్యాయం చేస్తా అని చంద్రబాబు హైదరాబాద్‌లో తనతో చెప్పారని, దీన్ని ఎలా నమ్మాలని కార్యకర్తలతో భూమా బ్రహ్మానందరెడ్డి పేర్కొన్నారు. నారా లోకేష్‌ పాదయాత్ర సమయంలో ‘బాబు ష్యూరిటీ.. భవిష్యత్తుకు గ్యారెంటీ’ కార్యక్రమాలకు భారీగా ఖర్చు చేసుకున్నానని, నాలుగున్నరేళ్లు పార్టీ నాయకులకు అండగా నిలిచానని, తనకే టికెట్‌ ఇవ్వాలని చెప్పినా వినిపించుకోలేదని సమావేశంలో భూమా ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. నంద్యాలలో పార్టీ బలోపేతం కోసం కృషి చేసిన తనకే పార్టీ అధినేత అన్యాయం చేస్తారని అనుకోలేదని కార్యకర్తలతో వాపోయారు.

ఫరూక్‌కు సహకరించొద్దు.. రెబల్‌గా పోటీ చేద్దాం
మాజీ మంత్రి ఫరూక్‌కు ఎవరు సహకరించవద్దు.. 15రోజులు చూసి అప్పటికీ చంద్రబాబు దిగిరాకపోతే వచ్చే ఎన్నికల్లో రెబల్‌గా పోటీ చేద్దామని అనుచరులకు భూమా స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ ఏ కార్యక్రమం చేపట్టినా దానికి పోటీగా మనం కార్యక్రమం నిర్వహిద్దాం. ఎవరి సత్తా ఏమిటో బాబుకు తెలిసేలా చేద్దాం. ఇందుకు తనకు అందరు సహకరించాలని కార్యకర్తలకు సూచించారు.

భూమాపై మాజీ మంత్రి గుస్సా!
ఫరూక్‌కు టికెట్‌ ఇస్తే గెలవడని, ఆయనకు సహకరించే ప్రసక్తే లేదని చంద్రబాబుకు భూమా బ్రహ్మం తెలియజేయడంతో ఫరూక్‌ వర్గీయులు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే భూమా బ్రహ్మానందరెడ్డి నిర్వహించే కార్యక్రమాలకు ఎవరూ వెళ్లవద్దని, తనకే టికెట్‌ ఒకే అయ్యిందని అందరూ తనవెంటే రావాలని పార్టీ శ్రేణులకు మాజీ మంత్రి ఫోన్లు చేసి చెబుతున్నారు. ఆదివారం భూమా నిర్వహించిన సమావేశానికి సైతం ఎవరూ వెళ్లొద్దని నాయకులకు ఆయన ఫోన్లు చేశారు. టీడీపీలో ఉండాలంటే తనతో ఉండాలని లేకపోతే పార్టీ పదవులు ఉండవని వార్నింగ్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భూమా, ఫరూక్‌ మధ్య నెలకొన్న విభేదాలు ఏ స్థాయికి చేరుకుంటాయోనని ఎవరి వైపు వెళ్లాలో అర్థం కాక ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement