రెంటచింతల కంటే ఎక్కువ! | - | Sakshi
Sakshi News home page

రెంటచింతల కంటే ఎక్కువ!

Mar 3 2026 7:22 AM | Updated on Mar 3 2026 7:22 AM

గత ఏడాది కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు

కర్నూలు(అగ్రికల్చర్‌): అధిక ఉష్ణోగ్రతలు ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే నమోదవుతుండటం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. వేసవి కాస్త ఆలస్యంగా మొదలైనప్పటికీ ఎండల తీవ్రత ఎక్కువగానే ఉంటోంది. ఇప్పటికే వేసవి భగభగలతో ప్రజలు అల్లాడుతున్నారు. అయినా చంద్రబాబు ప్రభుత్వం ఎలాంటి ఉపశమన చర్యలు తీసుకోలేదు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు చలువ పందిళ్లు ఏర్పాటు చేసింది. నగరపాలక సంస్థ, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల ద్వారా చలివేంద్రాలు, మజ్జిగ పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేసి వేసవి ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం కలిగించింది. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం ఉపశమన చర్యలు చేపట్టడం లేదు. ఈ సారి కూడా రాష్ట్రంలో తీవ్రమైన ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ ఇప్పటికే ప్రకటించింది. ముఖ్యంగా అధిక ఉష్ణోగ్రతలకు ఉమ్మడి కర్నూలు జిల్లా కేంద్రంగా మారింది. ఇప్పటికే ఉష్ణోగ్రతలు 38 డిగ్రీలకు చేరుకోవడం ఆందోళన కలిగించే విషయం.

చల్లదనం కనుమరుగు

గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉంటే వాతావరణం చల్లగా ఉంటుంది. గాలిలో తేమ శాతం తగ్గే కొద్ది వేడి, వడగాలుల తీవ్రత పెరుగుతోంది. ఫిబ్రవరి మొదటి వారంలో గాలిలో ఉదయం తేమ 90 శాతం వరకు, మధ్యాహ్నం సమయంలో 50 నుంచి 60 శాతం వరకు ఉంది. మార్చి మొదటి వారంలో ఉదయం పూట తేమ 50 శాతం వరకు, మధ్యాహ్న సమయంలో 15–20 శాతానికి పడిపోతోంది. ఒకవైపు ఎండల తీవ్రత, మరోవైపు వడగాల్పులు పెరుగుతున్నాయి. ఏప్రిల్‌లో ఉదయం పూట తేమ 40 శాతంలోపునకు, మధ్యాహ్నం సమయంలో 10 శాతానికి గాలిలో తేమ పడిపోయే ప్రమాదం ఉన్నట్లు వాతావరణ అధికారులు స్పష్టం చేస్తున్నారు. రానున్న రోజుల్లో వేసవి ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేసే ప్రమాదం ఏర్పడింది.

కనిపించని పచ్చదనం

జిల్లా మొత్తం విస్తీర్ణంలో అడవులు 33 శాతం వరకు ఉండాల్సి ఉంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 15 నుంచి 16 శాతం మాత్రమే అడవులు ఉన్నాయి. అడవులు తరిగిపోతుండటానికి తోడు వాయు కాలుష్యం పెరిగిపోతోంది. ఇది కూడా ఎండల తీవ్రత పెరగడానికి కారణమవుతోంది. భూగర్భ జలాలను ఎక్కువగా వినియోగిస్తుండటంతో భూమిలో నీటి నిల్వలు రోజురోజుకు ఇంకిపోతున్నాయి. గతేడాది అక్టోబరు నుంచి వర్షాలు లేవు. ఇందువల్ల భూమిలో తేమ లేకపోవడంతో ఎండల తీవ్రతకు నేలకు పగుళ్లు ఏర్పడి వాటి నుంచి వేడి సెగలు పుట్టుకొస్తున్నాయి.

అప్పుడే వడగాడ్పులు

వాహనాల సంఖ్య పెరగడంతో వాయు కాలుష్యం ఏర్పడుతోంది. కార్బన్‌ డైఅక్సైడ్‌ గాలిలో చేరుతుండటంతో భానుడి భగభగలు పెరుగుతున్నాయి. సాధారణంగా వాతావరణంలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటితే వేడి గాలులు వీయడం ప్రారంభిస్తాయి. ప్రస్తుతం 38 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు ఉంటున్నాయి. అప్పుడే వడగాడ్పులు మొదలు కావడం ఆందోళన కలిగించే విషయం. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎండల తీవ్రత ఉంటోంది.

ఉపశమనం లేనట్లే!

వేసవి తీవ్రత పెరుగుతున్నా ఉపశమన చర్యలు లేకపోవడంపై ఆందోళన వ్యక్తం అవుతోంది. గతేడాది వేసవి ఉపశమన చర్యలు కనిపించలేదు. ఈ సారి కూడా అధిక ఉష్ణోగ్రతలను చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకునే అవకాశం లేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో పంటలు ఎండకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, మూగజీవులకు నీరు అందుబాటులో ఉంచాలని వాతావరణ శాఖ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. అయితే ఈ సూచనలను చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితులు కనిపించడం లేదు.

గత ఏడాది వేసవితో పోలిస్తే ఈ వేసవిలో ఎండలు, వడగాడ్పుల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ సారి ప్రధానంగా ఎల్‌నినో ప్రభావం ఉంటుంది. ఏప్రిల్‌, మే నెలల్లో 45–46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది. రైతులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పంటలు ఎండకుండా నీటితడులు ఇచ్చుకోవాలి. మూగజీవులకు నీరు అందుబాటులో ఉంచాలి. వడదెబ్బకు గురి కాకుండా అన్ని వర్గాల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

– నారాయణ స్వామి, ప్రధానశాస్త్రవేత్త,

వ్యవసాయ వాతావరణ విభాగం, అనంతపురం

ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2024లో అత్యధికంగా 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. 2025లో 46 డిగ్రీల వరకు నమోదయ్యాయి. ఇవే దేశంలోనే ఇదే అత్యధిక ఉష్ణోగ్రతలు. రాష్ట్రంలో సాధారణంగా అత్యధిక ఉష్ణోగ్రతలు రెంటచింతలలో నమోదు అవుతాయి. రెంటచింతల కంటే కర్నూలు, నంద్యాల జిల్లాల్లోనే రెండు, మూడు డిగ్రీలు ఎక్కువ నమోదు అవుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో కాలుష్యం బెడద ఎక్కువగా ఉంది. కాలుష్యం పెరిగే కొద్ది ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతాయి. రానున్న ఐదు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 39 డిగ్రీలకు చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కనిష్ట ఉష్ణోగ్రతలు 24 డిగ్రీల వరకు ఉంటాయని వాతావరణ అధికారులు తెలిపారు.

ఉపాధి కూలీలకు ఎండదెబ్బ

ఉపాధి పనులకు జనవరి నుంచి మే నెల వరకు సీజన్‌ వంటిది. ఉమ్మడి జిల్లాలో మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో దాదాపు 3 లక్షల మంది ఉపాధి పనులకు హాజరయ్యే అవకాశం ఉంది. వేసవి తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉన్నందున ఉపాధి పనులు జరిగే ప్రాంతంలో నీడ సదుపాయం కల్పించాల్సిన అవసరం ఉంది. గతేడాది ఉపాధి కూలీల గురించి పట్టించుకోక పోవడంతో వడదెబ్బకు గురై దాదాపు ఉమ్మడి జిల్లాలో ఎనిమిది మంది మృతి చెందారు. వారికి ఎలాంటి ఆర్థిక సహాయం అందలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement