నల్లగొండ : పెండింగ్‌లో ఉన్న ప్రజావాణి అర్జీల్లో 75 శాతం వచ్చే వారం నాటికి పరిష్కరించాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి 85 అర్జీలను స్వీకరించి మాట్లాడారు. జిల్లా అధికారులు సంబంధిత సెక్షన్ల సూపరింటెండెంట్లతో అర్జీలపై ప్రత్యేకంగా సమీక్షించి త్వరితగతిన పరిష్కరించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. పాఠశాల విద్యార్థులందరికీ ఈనెలాఖరులోగా ఆధార్ కార్డులు జారీ పూర్తి చేయాలన్నారు. బడి మానేసిన పిల్లలందరినీ తిరిగి చేర్పించాలన్నారు. ఎల్‌నినో దృష్టిలో ఉంచుకొని తాగునీటికి ఇబ్బందులు లేకుండా పైపులైన్లు, మరమ్మతుల నిర్వహణ చేపట్టాలని, తాగునీటి ప్రాధాన్యత, వాననీటి సంరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. ఎట్టి పరిస్థితిలోనూ అనర్హులకు చేయూత పించన్లు ఇవ్వరాదన్నారు. ప్రజావాణికి రాని అధికారులకు షోకాజ్ నోటీసు జారీ చేయాలని కలెక్టరేట్ ఏఓ మోతీలాల్‌ను ఆదేశించారు. శిక్షణ సహాయ కలెక్టర్ ఎన్.శ్రీకాంత్‌రెడ్డి, డీఆర్‌ఓ దశరథ్, డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి కూడా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.
ఫ కలెక్టర్ చంద్రశేఖర్


