గతేడాది అక్టోబర్‌తో పోలిస్తే భారీగా తగ్గిపోయిన నీటిమట్టాలు | - | Sakshi
Sakshi News home page

గతేడాది అక్టోబర్‌తో పోలిస్తే భారీగా తగ్గిపోయిన నీటిమట్టాలు

Nov 3 2026 2:27 AM | Updated on Nov 3 2026 2:27 AM

న్యూస్‌రీల్‌

జీఓ 25ను సవరించాలి
జీఓ 25ను తక్షణమే సవరించాలని యూటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదిమూలం వెంకట్‌ అన్నారు.

ఉత్పత్తి సంస్థలుగా పీఏసీఎస్‌లు

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను ప్రభుత్వం రైతు ఉత్పత్తి సంస్థలుగా(ఎఫ్‌పీఓ) మారుస్తోంది.

మంగళవారం శ్రీ 3 శ్రీ నవంబర్‌ శ్రీ 2026

- 8లో

- 10లో

ఫ 5.70 మీటర్ల నుంచి 8.94 మీటర్లకు లోతుకు..

ఫ దామరచర్లలో అత్యధికంగా 17.74 మీటర్ల లోతులో భూగర్భ జలం

ఫ పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్‌లో నీటి కష్టాలే

ఫ అనుమతి లేకుండా బోర్లు వేస్తే సీజ్‌

సాక్షి ప్రతినిధి, నల్లగొండ : భూగర్భ జలాలు ఆందోళనకర స్థాయికి పడిపోతున్నాయి. భూగర్భ జల శాఖ అక్టోబర్‌–2026 నివేదిక ప్రకారం గతేడాది అక్టోబర్‌లో జిల్లా సగటు భూగర్భ జలమట్టం 5.70 మీటర్లపైన ఉండగా, ప్రస్తుతం 8.94 మీటర్ల లోతుకు చేరింది. అంటే ఏడాది వ్యవధిలో ఏకంగా 3.24 మీటర్ల మేర లోతుకు పడిపోయింది. పలు మండలాల్లో గతేడాదితో పోలిస్తే రెట్టింపునకు చేరువగా భూగర్భ జలాలు లోతుకు వెళ్లడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. మరోవైపు ఈ ఏడాది సెప్టెంబర్‌తో పోల్చినా అక్టోబర్‌లో జిల్లా సగటు నీటిమట్టం 52 సెంటీమీటర్లు తగ్గింది. జిల్లాలోని 33 మండలాల్లో 25 మండలాల్లో నెల వ్యవధిలోనే నీటిమట్టాలు మరింత లోతుకు వెళ్లాయి. భూగర్భ జలాల పరిస్థితి ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో సాగు, తాగునీటి అవసరాలకు ఇబ్బందులు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. భూగర్భ జలాల విచ్చలవిడి వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు అనుమతులు లేకుండా బోర్లు వేస్తే సీజ్‌ చేసేలా చర్యలు చేపట్టనున్నారు.

దామరచర్లలో 17.74 మీటర్లు

జిల్లాలో అత్యంత లోతులో భూగర్భ జలాలు ఉన్న మండలంగా దామరచర్ల నిలిచింది. ఇక్కడ ఏకంగా 17.74 మీటర్ల లోతుకు నీటిమట్టం పడిపోయింది. గతేడాది అక్టోబర్‌లో ఇదే మండలంలో 10.55 మీటర్ల లోతులో నీరు ఉండగా.. ఏడాదిలో మరో 7.19 మీటర్ల మేర లోతుకు వెళ్లింది.

కొన్ని మండలాల్లో రెట్టింపునకు చేరువగా

గతేడాది అక్టోబర్‌ గణాంకాలతో పోలిస్తే కొన్ని మండలాల్లో భూగర్భ జలాల లోతు భారీగా పెరిగింది. నాంపల్లిలో గతేడాది 1.28 మీటర్ల లోతులో నీరు ఉండగా.. ప్రస్తుతం 4.88 మీటర్లకు చేరింది. గుండ్లపల్లిలో 3.86 మీటర్ల నుంచి 9.62 మీటర్లకు, గుర్రంపోడులో 2.46 మీటర్ల నుంచి 6.02 మీటర్లకు, కేతేపల్లిలో 0.76 మీటర్ల నుంచి 1.68 మీటర్లకు, కనగల్‌లో 5.02 మీటర్ల నుంచి 10.04 మీటర్లకు చేరింది. నిడమనూరులో 4.12 మీటర్ల నుంచి 9.64 మీటర్లకు, వేములపల్లిలో 2.99 మీటర్ల నుంచి 9.58 మీటర్లకు, నకిరేకల్‌లో 6.17 మీటర్ల నుంచి 10.67 మీటర్లకు నీటిమట్టం లోతుకు వెళ్లింది. ఈ మండలాల్లో ఏడాది వ్యవధిలో చోటుచేసుకున్న మార్పులు భూగర్భ జలాల పరిస్థితి ఎంతగా దిగజారిందో తెలియజేస్తున్నాయి.

నెల రోజుల్లోనే 25 మండలాల్లో తగ్గుదల

సెప్టెంబర్‌ నుంచి అక్టోబర్‌ మధ్య కాలంలోనూ జిల్లాలోని 25 మండలాల్లో భూగర్భ జలాలు మరింత లోతుకు వెళ్లాయి. మునుగోడులో అత్యధికంగా 1.72 మీటర్లు, కనగల్‌లో 1.42 మీటర్లు, వేములపల్లిలో 1.41 మీటర్లు, చింతపల్లిలో 1.37 మీటర్లు, దేవరకొండలో 1.34 మీటర్లు, మర్రిగూడలో 1.24 మీటర్లు, తిరుమలగిరి సాగర్‌లో 1.21 మీటర్లు, చండూరులో 0.98 మీటర్ల మేర నీటిమట్టం తగ్గింది. మరోవైపు మిర్యాలగూడలో 0.98 మీటర్లు, చిట్యాలలో 0.73 మీటర్లు, నేరేడుగొమ్ములో 0.68 మీటర్లు, మాడుగులపల్లిలో 0.51 మీటర్లు, గుడిపల్లిలో 0.15 మీటర్లు, అడవిదేవులపల్లిలో 0.11 మీటర్ల మేర నీటిమట్టం పెరిగింది. కొండమల్లేపల్లిలో ఎలాంటి మార్పు లేదు. నార్కట్‌పల్లిలో 0.01 మీటర్లు, దామరచర్లలో 0.02 మీటర్ల స్వల్ప పెరుగుదల నమోదైంది.

అనుమతి లేకుండా బోర్లు వేస్తే సీజ్‌

భూగర్భ జలాలు రోజురోజుకూ లోతుకు వెళ్తుండటంతో ఇష్టారాజ్యంగా బోర్లు వేసి నీటిని తోడేయడం వల్ల భవిష్యత్తులో నీటి సమస్యలు మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో బోర్లు వేయాలంటే సంబంధిత శాఖల నుంచి ముందస్తు అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. అనుమతులు లేకుండా బోర్లు వేస్తే వాటిని సీజ్‌ చేయడంతో పాటు నిబంధనల ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంది. రైతులు, ప్రజలు భూగర్భ జలాలను పొదుపుగా వినియోగించుకోవాలని, వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాల పెంపునకు చర్యలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement