కన్నవారి కన్నీటి వేదన | - | Sakshi
Sakshi News home page

కన్నవారి కన్నీటి వేదన

Nov 3 2026 2:27 AM | Updated on Nov 3 2026 2:27 AM

కలెక్టర్‌కు వినతి..

నల్లగొండ : పుట్టుకతోనే దివ్యాంగులైన ఇద్దరు కుమార్తెలను ఆ తల్లిదండ్రులు కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. వారు కోలుకుంటారన్న ఆశతో ఉన్నదంతా ఊడ్చి లక్షల రూపాయలు వైద్యానికి ఖర్చు చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఇప్పుడు వారి వయసు పెరుగుతుండటంతో.. ‘మా తర్వాత మా పిల్లల పరిస్థితి ఏంటి?’ అన్న ఆందోళనతో ఆ కన్నవారు రోజురోజుకూ కుమిలిపోతున్నారు. తమ పెద్ద కుమార్తెకు ఏదైనా ఉద్యోగం ఆసరాగా ఉంటుందని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

శరీరం సహకరించకపోయినా..

చదువుపై ఆసక్తి..

చింతపల్లి మండలం గొడకొండ్ల గ్రామానికి చెందిన శ్రీనివాస్‌–అనిత దంపతులకు నిఖిత, నితిషా అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇద్దరూ పుట్టుకతోనే శారీరక వైకల్యంతో బాధపడుతున్నారు. శరీరం సహకరించకపోయినా చదువుకోవాలన్న వారి తపనకు తల్లిదండ్రులు ప్రోత్సాహం అందించారు. దీంతో పెద్ద కుమార్తె నిఖిత ఇంటర్‌ వరకు చదువుకుంది. చిన్న కుమార్తె నితిషా మాత్రం ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆరో తరగతితోనే చదువు ఆపేసింది. తమ పనులు తాము చేసుకోలేని స్థితిలో ఉన్న ఈ ఇద్దరి ఆలనాపాలనా చూసుకోవడానికే తల్లి అనిత సమయం సరిపోతోంది.

చెప్పుల దుకాణమే జీవనాధారం..

శ్రీనివాస్‌ చింతపల్లిలో రోడ్డు పక్కన చిన్న చెప్పుల దుకాణం నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. దాని ద్వారా వచ్చే కొద్దిపాటి ఆదాయం అద్దె ఇల్లు, ఇతర కుటుంబ అవసరాలకే సరిపోవడం లేదు. పిల్ల ల వైద్యం కోసం ఇప్పటివరకు లక్షల రూపాయలు వెచ్చించినా లాభం లేకపోయింది. ఒకవైపు పిల్లల సంరక్షణ, మరోవైపు కుటుంబ పోషణతో ఆ దంపతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

మా తర్వాత వారి పరిస్థితి ఏంటి?

‘మేము బతికి ఉన్నంత కాలం పిల్లలను కంటికి రెప్పలా చూసుకుంటాం. కానీ, మా తర్వాత వారి పరిస్థితి ఏంటన్నదే మమ్మల్ని వేధిస్తోంది’ అని శ్రీనివాస్‌ దంపతులు కన్నీరుమున్నీరవుతున్నారు. పెద్ద కుమార్తె నిఖిత ఇంటర్‌ వరకు చదువుకున్నందున, ఆమెకు తగిన ఏదైనా ఆఫీసు ఉద్యోగం (రాత పని) కల్పించాలని కోరుతున్నారు. ఉద్యోగం వస్తే కనీసం తన జీవనాన్ని తాను కొనసాగించగలదని, చెల్లెలికి కూడా భరోసా ఉంటుందని ఆశిస్తున్నారు.

సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో శ్రీనివాస్‌ దంపతులు తమ ఇద్దరు కుమార్తెలతో కలిసి వచ్చి కలెక్టర్‌ను కలిశారు. పిల్లల వైకల్యం, కుటుంబ ఆర్థిక ఇబ్బందులు, భవిష్యత్‌పై తమకున్న ఆందోళనను వివరించి కన్నీటిపర్యంతమయ్యారు. పెద్ద కుమార్తెకు ఉద్యోగ అవకాశం కల్పించి, ప్రభుత్వపరంగా ఆదుకోవాలని వేడుకున్నారు. వారి పరిస్థితిని విన్న కలెక్టర్‌ చలించిపోయి, తగిన సాయం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఫ 20 ఏళ్లుగా దివ్యాంగ కూతుళ్ల ఆలనాపాలనా

ఫ వైద్యం కోసం రూ.లక్షల ఖర్చు.. అయినా ఫలితం శూన్యం

ఫ పెద్ద కూతురుకు ఉద్యోగమిచ్చి ఆదుకోవాలని ప్రజావాణిలో కలెక్టర్‌కు వినతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement