నల్లగొండ : ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు విద్యుత్ ఆదా చేయాలని కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో ఆయన ప్రజల ఫిర్యాదులు స్వీకరించిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. 30 రోజులకు మించి పెండింగ్ లో ఉన్న ప్రజావాణి దరఖాస్తులన్నీ ఈ వారంలోగా పరిష్కరించాలని ఆదేశించారు. జిల్లా స్థాయిలో 391, మండల స్థాయిలో 359 ప్రజావాణి ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ప్రజావాణిపై ఈ నెలలో ప్రత్యేకంగా సమీక్షిస్తానన్నారు. ఈనెల 7వ తేదీ వరకు నిర్వహించనున్న సేవ్ ఎనర్జీ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు, ప్రజలు అన్ని వర్గాల ప్రజలను భాగస్వామ్యం చేయాలన్నారు. జిల్లా, మండల, గ్రామస్థాయి వరకు అధికారులు, సిబ్బంది ప్రతిరోజు ఉదయం10.30 గంటల నుంచి 11:30 వరకు అన్ని కార్యాలయాలలో సూర్యరశ్మి ఎక్కువగా ఉన్నచోట లైట్లు, ఫ్యాన్లు వేసుకోవద్దని తెలిపారు. విద్యుత్‌ను ఎలా ఆదా చేయాలనే దానిపై విద్యార్థులకు చిట్కాలను తెలియజేయాలని సూచించారు. అనంతరం అధికారుల చేత ఆయన విద్యుత్‌ను పొదుపు చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు.అనంతరం జనజాతీయ గౌరవ దివస్ సెలబ్రేషన్స్‌పై రూపొందించిన వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ ప్రేమ్‌కరణ్‌రెడ్డి, డిప్యూటీ కలెక్టర్ (ట్రెయినీ) శ్రీకాంత్‌రెడ్డి, డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి, డీటీడీఓ కమలాకర్‌రెడ్డి, రెడ్కో ప్రతినిధి అశోక్ తదితరులు పాల్గొన్నారు.


