అక్రమార్కుల్లో వణుకు...
నల్లగొండ టూటౌన్ : నీలగిరి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో అడ్డగోలుగా సర్టిఫికెట్లు జారీ చేసి అందిన కాడికి దండుకున్నారనే చర్చ జరుగుతోంది. ప్రత్యేకాధికారుల పాలనలో ఈ దందాకు అడ్డూఅదుపు లేకుండా సాగిందనే విమర్శలు వ్యక్తవుతున్నాయి. ఆ సమయంలో అక్రమ వ్యవహారాలను గుట్టుచప్పుడు కాకుండా పని కానిచ్చేసి రూ.లక్షలు దండుకున్నది బహిరంగ రహస్యమే అనే చర్చ జరుగుతోంది. గతంలో ఇక్కడ పని చేసిన కమిషనర్లు అక్రమార్కులకు అండగా నిలిచారనే చర్చ లేకపోలేదు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో మృతి చెందిన వెంకటేశ్వర్లుకు ప్రత్యేకాధికారుల పాలనలోనే నీలగిరి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి మరణ ధ్రువీకరణ పత్రం ఇచ్చారు. ఇలాంటి అక్రమ వ్యవహారాలు ఇంకా ఎన్ని ఉన్నాయో అనే అనుమానాలను వ్యక్తమవుతున్నాయి.
బీడీఆర్ నిత్య కల్యాణం.. పచ్చతోరణం
మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లో బర్త్ అండ్ డెత్ రిజిస్టార్ (బీడీఆర్) విభాగాలు నిత్య కల్యాణం.. పచ్చ తోరణంగా మారింది. ఈ విభాగంలో పనిచేసే వారికి డబ్బులకు ఏ మాత్రం కొదవ ఉండదనే నానుడి ఎప్పటి నుంచో ఉంది. ఈ విభాగం నుంచి గతంలో ఇక్కడ పనిచేసిన ఇద్దరు కమిషనర్లకు నెలకు రూ.60 వేల నుంచి రూ.లక్ష వరకు ముడుపులు అందాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రత్యేకాధికారుల పాలనలో జరిగిన ఈ అక్రమాలపై పూర్తి స్థాయి విచారణ జరిపితే నిజాలు బయటపడే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సీబీఐ కేసు అయినా మారని బుద్ధి..
నీలగిరి మున్సిపాలిటీలో గతంలో కూడా ఓసారి మరణ ధ్రువీకరణ పత్రం జారీలో అక్రమాలకు పాల్పడిన ఘటనలో సీబీఐ అధికారులు కేసు నమోదు చేసి ఓ ఉద్యోగిని అరెస్ట్ చేశారు. ఒకసారి ఇలాంటి ఘటన జరిగిన తరువాత కూడా సంబంధిత విభాగం ఉద్యోగుల వక్ర బుద్ధి మారలేదు. కాసుల కోసం అడ్డదారిలో సర్టిఫికెట్లు జారీ చేస్తూ అడ్డంగా దొరికిపోతున్నారు.
అక్రమంగా మరణ ధ్రువీకరణ పత్రం జారీ చేసిన ఉద్యోగుల్లో వణుకు పడుతున్నట్లు తెలిసింది. తమ మీదకు రాకుండా ముందు జాగ్రత్తగా ఇతరులపై నెపం నెట్టివేసే ప్రయత్నం జరుగుతున్నట్లు విశ్వనీయవర్గాల సమాచారం. ఈ వ్యవహారంలో ఓ చిరుద్యోగిని ఇరికించి బయట పడేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారనే చర్చ జరుగుతోంది. తమకు సంబంధం లేదంటూ బుకాయింపు మొదలు పెట్టి తప్పించుకునేందుకు ఎదురుదాడి చేస్తున్నట్లు సమాచారం.
ఫ నీలగిరి కార్పొరేషన్‌లో అవినీతిమయం
ఫ గతంలో పనిచేసిన కమిషనర్లకు వాటాలు పంచారనే ఆరోపణలు
ఫ ప్రత్యేకాధికారుల పాలనలోనే
ఎక్కువగా అక్రమాలు


