నల్లగొండ : దేశ సమైక్యత, సమగ్రతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. భారత తొలి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ 151వ జయంతి సందర్భంగా శనివారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ఏక్తా దివస్ కార్యక్రమంలో మాట్లాడారు. భారతదేశం స్వాతంత్య్రం పొందిన తర్వాత హైదరాబాద్ సంస్థానాన్ని వల్లభాయ్ పటేల్ విలీనం చేసిన తీరును అందరూ గుర్తుకు తెచ్చుకోవాలన్నారు. అనంతరం ఆయన ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, ఏఓ మోతిలాల్ పాల్గొన్నారు.
అగ్రి స్టాక్‌ను వినియోగించుకునేలా చూడాలి
రైతులు సాగులో లబ్ధి పొందేందుకు అగ్రిస్టాక్ (డిజిటల్ ప్లాట్ ఫారం)ను సమర్థంగా వినియోగించుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. అగ్రిస్టాక్‌పై శనివారం తన క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫార్మర్స్ రిజిస్ట్రీ, భూమి వివరాల డిజిటలైజేషన్, డిజిటల్ క్రాప్ సర్వే తదితర విషయాలపై రైతులకు అవగాహన కల్పించాలన్నా రు. భూముల రీ సర్వేతో పాటు, రైతుల డిజిటల్ క్రాప్ సర్వేను అనుసంధానం చేయాలని చెప్పారు. అగ్రిస్టాక్‌లో యువ రైతులను భాగస్వాములను చేయాలన్నారు. కార్యక్రమంలో డీఏఓ వినోద్‌కుమార్, ఉద్యాన అధికారి శేఖర్, నాబార్డ్ డీడీఎం వినయ్‌కుమార్, సీపీఓ శ్రీనివాస్‌నాయక్, డీసీఓ మమత, మార్కెటింగ్ ఏడీ ఛాయాదేవి, సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడీ దేవరాజ్, డీఎస్‌ఓ వెంకటేశం, పశు సంవర్ధక శాఖ ఏడీ నరసింహారెడ్డి పాల్గొన్నారు.


