తుది జాబితాపైనే ఆశలు..
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఉమ్మడి జిల్లాను కరువు కమ్మేసింది. జిల్లాలోని 73 మండలాలకుగాను 50 మండలాలు కరువు బారిన పడ్డాయి. వీటిలో 18 మండలాలు తీవ్ర కరువు, మరో 32 మండలాలు మోస్తరు కరువు ప్రభావానికి గురైనట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. మూడు జిల్లాల పరిధిలో అదనంగా మరో 18 మండలాలను కరువు జాబితాలో చేర్చేందుకు అధికారులు ప్రతిపాదనలు చేశారు. ప్రతిపాదిత మండలాల్లో పంట నష్టం 40 నుంచి 60 శాతం వరకు ఉన్నట్లు అంచనా వేశారు.
నల్లగొండలో 20
నల్లగొండ జిల్లాలో 20 మండలాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించారు. వీటిలో 13 మండలాలను తీవ్ర కరువు, ఏడు మండలాలను మోస్తరు కరువు ప్రభావిత ప్రాంతాలుగా వర్గీకరించారు. వీటికి అదనంగా మరో 8 మండలాల్లో 40 నుంచి 60 శాతం పంటనష్టం వాటిల్లినట్లు తేల్చారు. వాటిని కూడా కరువు జాబితాలో చేర్చే అవకాశం ఉంది. ప్రతిపాదిత మండలాల్లో దేవరకొండ, చందంపేట, కనగల్, మునుగోడు, నార్కట్పల్లి, శాలిగౌరారం, తిప్పర్తితో పాటు మరొక మండలం ఉన్నాయి. అయితే, ఇందులో 7 మండలాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతినగా, ఒక మండలంలో ఒక మోస్తారుగా దెబ్బతిన్నట్లు అధికారులు తేల్చారు.
యాదాద్రిలో 11 మండలాలు..
యాదాద్రి భువనగిరి జిల్లాలోనూ కరువు ప్రభావం కనిపిస్తోంది. అక్కడ ఒక మండలంలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొనగా 10 మండలాల్లో కరువు పరిస్థితులు ఉన్నట్లుగా ప్రభుత్వం అంచనా వేసింది. అదనంగా ఆరు మండలాల్లో 40 నుంచి 48 శాతం పంటలు దెబ్బతిన్నట్లు లెక్కలు వేసింది. వాటిని కరువు ప్రభావిత జాబితాలో చేర్చే అవకాశం ఉంది. అందులో అడ్డగూడూరు, ఆలేరు, ఆత్మకూరు(ఎం), చౌటుప్పల్, గుండాల, నారాయణపూర్ మండలాలు ఈ జాబితాలో ఉన్నాయి. వర్షాభావ పరిస్థితులు, పంటల ఎదుగుదలలో ఆటంకాలు, సాగు ఖర్చులు పెరగడం రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
సూర్యాపేటలో 19 మండలాల్లో
కరువు పరిస్థితులు..
19 మండలాల్లో కరువు నెలకొంది. అందులో 4 మండలాల్లో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొనగా, 15 మండలాల్లో సాధారణ కరువు ఉన్నట్లుగా అధికారులు లెక్కలు తేల్చారు. మరో నాలుగు మండలాల్లో 40 నుంచి 50 శాతం పంట నష్టం జరిగినట్లు తేల్చారు. వాటిని కూడా కరువు మండలాల జాబితాలో చేర్చేందుకు ప్రతిపాదనలు చేసినట్లు వివరాలు వెల్లడిస్తున్నాయి. మేళ్లచెరువు, తుంగతుర్తి, మద్దిరాల, మట్టంపల్లి మండలాలు ఈ జాబితాలో ఉన్నాయి.
ఎండుతున్న పంటలు.. పెరుగుతున్న నష్టాలు
వానాకాలం ప్రారంభంలో ఆశలు పెట్టుకున్న రైతులకు వర్షాభావ పరిస్థితులు నిరాశ మిగిల్చాయి. వర్షాలు సకాలంలో కురవకపోవడం, సాగునీటి లభ్యత తగ్గడం, భూగర్భ జలాలపై ఆధారపడిన పంటలకు తగినంత నీరు అందకపోవడంతో దిగుబడులపై ప్రభావం పడుతోంది. పెట్టుబడుల కోసం అప్పులు చేసిన రైతులు పంటలు దెబ్బతినడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కరువు ప్రభావిత మండలాల గుర్తింపు, అదనపు మండలాల ప్రతిపాదనలపై రైతుల్లో ఆశలు నెలకొన్నాయి. పంట నష్టాన్ని క్షేత్రస్థాయిలో అంచనా వేసి, అర్హులైన రైతులకు పరిహారం అందించాలని వారు కోరుతున్నారు.
ఉమ్మడి జిల్లాలో 50 మండలాలు కరువు ప్రాంతాలుగా గుర్తింపు
రాష్ట్రవ్యాప్తంగా అదనంగా 43 మండలాలను కరువు జాబితాలో చేర్చేందుకు ప్రతిపాదనలు రావడంతో కరువు ప్రభావిత ప్రాంతాల పరిధి మరింత పెరిగే అవకాశం ఉంది. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే 50 మండలాలను చేర్చగా మిగతా 18 మండలాలను చేర్చితే ఉమ్మడి జిల్లా 93.15 శాతం కరువు మండలాలే కానున్నాయి. అయితే, ప్రతిపాదిత మండలాలన్నింటికీ అధికారిక ఆమోదం లభించకపోవచ్చు. తుది జాబితా, పంట నష్టం అంచనాలు, రైతులకు అందించే సాయంపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల కోసం అన్నదాతలు ఎదురుచూస్తున్నారు.
ఫ 18 మండలాల్లో తీవ్రంగా..
32 మండలాల్లో మోస్తరుగా..
ఫ మరో 18 మండలాలను కూడా కరువు జాబితాలో చేర్చేందుకు ప్రతిపాదన
ఫ మొత్తంగా 68 మండలాల్లో
కరువు ఛాయలు..
ఫ ఇప్పటికే ఎండిపోయిన పంటలు.. తగ్గిపోయిన దిగుబడులు


