ఏదుల నుంచే డిండికి నీరు | - | Sakshi
Sakshi News home page

ఏదుల నుంచే డిండికి నీరు

Oct 24 2026 11:07 AM | Updated on Oct 24 2026 11:07 AM

గతేడాది కేబినెట్‌లోనే నిర్ణయం

ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం

సాక్షి ప్రతినిధి, నల్లగొండ : డిండి ఎత్తిపోతల పథకానికి నీటి కేటాయింపుపై నెలకొన్న గందరగోళానికి తెరపడింది. ఏదుల రిజర్వాయర్‌ నుంచే డిండికి నీటిని తీసుకునేందుకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఇన్నాళ్లూ ఏదుల నుంచి డిండికి నీటిని ఇవ్వడంపై మహబూబ్‌నగర్‌ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు అభ్యంతరాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం ముఖ్యమంత్రి అధ్యక్షతన మంత్రులు, ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో డిండికి ఏదుల నుంచే నీటిని తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. శ్రీశైలం నుంచి ఏదుల రిజర్వాయర్‌కు 2 టీఎంసీలతో పాటు అదనంగా మరో 0.6 టీఎంసీ నీటిని తీసుకునేలా నిర్ణయించారు. అలాగే ఏదుల నుంచి డిండి ఎత్తిపోతల పథకానికి 0.5 టీఎంసీ నీటిని తీసుకునేందుకు అంగీకరించారు. దీంతో డిండి ప్రాజెక్టుకు ఏదుల నుంచే నీటిని తీసుకోవాలన్న నల్లగొండ జిల్లా ప్రజాప్రతినిధులు, ప్రజాసంఘాల డిమాండ్‌కు సానుకూలత లభించినట్లయింది.

ఫోరోసిస్‌ పీడకు విముక్తి

నల్లగొండ జిల్లాలోని ఫ్లోరైడ్‌ ప్రభావిత ప్రాంతాలకు తాగునీటితో పాటు సాగునీరు అందించాలన్న లక్ష్యంతో డిండి ఎత్తిపోతల పథకాన్ని చేపట్టారు. ఈ ప్రాజెక్టుకు ఏదుల నుంచి నీటిని తీసుకునే అంశంపై మహబూబ్‌నగర్‌ జిల్లా నుంచి అభ్యంతరాలు రావడంతో కొంతకాలంగా ప్రతిష్టంభన నెలకొంది. శ్రీశైలం బ్యాక్‌వాటర్‌ నుంచే నేరుగా డిండికి నీటిని తరలించాలన్న ప్రతిపాదన కూడా తెరపైకి రావడంతో వివాదం మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన సమావేశంలో ఏదుల నుంచి నీటి కేటాయింపునకు అంగీకారం కుదరడంతో డిండి ప్రాజెక్టుపై ఆశలు చిగురించాయి.

2007లో ప్రాజెక్టుకు రూపకల్పన

డిండి ఎత్తిపోతల పథకానికి 2007లో అప్పటి ప్రభుత్వం రూపకల్పన చేసింది. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టులో అంతర్భాగంగా ఈ పథకాన్ని ప్రతిపాదించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వా త 2015 జూన్‌ 11న అప్పటి ప్రభుత్వం రూ.6,194 కోట్లతో ప్రాజెక్టు నిర్మాణానికి జీఓ నంబర్‌ 107 జారీ చేసింది. ప్రాజెక్టులో భాగంగా ఐదు రిజర్వాయర్ల నిర్మాణ పనులకు అప్పటి సీఎం కేసీఆర్‌ అదే ఏడాది శివన్నగూడెం వద్ద శంకుస్థాపన చేశారు. అనంతరం రిజర్వాయర్ల నిర్మాణ పనులు ప్రారంభమై వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. అయితే ప్రాజెక్టు డీపీఆర్‌ పూర్తయినప్పటికీ ఆమోదం పొందడంలో జాప్యం జరిగింది.

2025 జనవరి 5న ఏదుల రిజర్వాయర్‌ నుంచి డిండికి నీటిని తీసుకోవాలని రాష్ట్ర కేబినెట్‌ నిర్ణయించింది. ఇందుకోసం ఏదుల నుంచి 21.575 కిలోమీటర్ల మేర కాలువలు, టన్నెల్‌ తదితర పనులకు రూ.1,800 కోట్లు మంజూరు చేసి టెండర్లు పిలిచింది. ప్రస్తుతం డిండి, సింగరాజుపల్లి, కిష్టరాంపల్లి, శివన్నగూడెం సహా పలు రిజర్వాయర్ల నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నాయి. అయితే ఏదుల నుంచి నీటి కేటాయింపుపై వివాదం కారణంగా ప్రాజెక్టు పనులు, భవిష్యత్తుపై నీలి నీడలు కమ్ముకున్నాయి ఈ క్రమంలో ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆమోదం లభించడం వాటన్నింటికీ తెరపడినట్లు అయ్యింది.

ఫ సీఎం అధ్యక్షతన జరిగిన

సమావేశంలో నిర్ణయం

ఫ శ్రీశైలం నుంచి ఏదులకు

2 టీఎంసీలతో పాటు

అదనంగా 0.6 టీఎంసీ

ఫ ఏదుల నుంచి డిండికి 0.5 టీఎంసీ తీసుకునేందుకు రెండు జిల్లాల నేతల సమ్మతి

ఫ డిండి ఎత్తిపోతల పథకంపై

చిగురిస్తున్న ఆశలు

డిండి ఎత్తిపోతల పథకానికి ఏదుల నుంచే నీటిని తీసుకునేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నాం. ఈ నిర్ణయంతో నల్లగొండ జిల్లా ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేరే అవకాశం ఏర్పడింది. ఫ్లోరైడ్‌ పీడిత ప్రాంతాలకు తాగునీటితో పాటు సాగునీరు అందించడంలో డిండి ప్రాజెక్టు కీలకంగా మారనుంది. ప్రాజెక్టు పూర్తయితే దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాల్లోని రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. ప్రజల తాగునీటి సమస్యలు కూడా తగ్గుతాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కార్యరూపంలోకి తీసుకువచ్చి, పెండింగ్‌ పనులను వేగవంతం చేయాలి. డిండి ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసి జిల్లా ప్రజల ఆశలను నెరవేర్చాలి.

– నెల్లికంటి సత్యం, ఎమ్మెల్సీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement