భవిష్యత్‌లో తాగునీటి ఇబ్బందులు రావొద్దు | - | Sakshi
Sakshi News home page

భవిష్యత్‌లో తాగునీటి ఇబ్బందులు రావొద్దు

Oct 24 2026 11:07 AM | Updated on Oct 24 2026 11:07 AM

దేవరకొండ : రానున్న రోజుల్లో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ చంద్రశేఖర్‌ అధికారులకు సూచించారు. శుక్రవారం దేవరకొండ పట్టణంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఎల్‌నినో ప్రభావం–తీసుకోవాల్సిన చర్యలపై సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఎల్‌నినో వల్ల వాతావరణ మార్పుల ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో నీటి వనరులను కాపాడుకోవాలన్నారు. గ్రామాల్లో చెరువులు, మిషన్‌ భగీరథ, బోర్లు, కాలువలు, వర్షపు నీటి ద్వారా లభించే నీటి నిల్వలపై ఆడిట్‌ నిర్వహించాలని ఆదేశించారు. నీటి సంరక్షణ చర్యల్లో భాగంగా గ్రామాల్లో పైప్‌లైన్‌ లీకేజీలను అరికట్టాలని, ఇంకుడు గుంతల నిర్మాణం ద్వారా వర్షపు నీటిని భూమిలోకి ఇంకేలా చర్యలు చేపట్టాలన్నారు. తక్కువ నీటితో పండించే ఆరుతడి పంటలపై రైతులు దృష్టి సారించాలని సూచించారు. అనంతరం ఎల్‌నినో ప్రభావం–నివారణ, నీటి పొదుపుపై రూపొందించిన కరత్రాలు ఆవిష్కరించారు. సదస్సులో సబ్‌ కలెక్టర్‌ కరోలిన్‌ చింగ్తియాన్‌ మావి, స్థానిక సంస్థల ఇన్‌చార్జి అదనపు కలెక్టర్‌ ప్రేమ్‌కరణ్‌రెడ్డి, సహాయ కలెక్టర్‌ (ట్రెయినీ) శ్రీకాంత్‌రెడ్డి, డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి, డీఏఓ వినోద్‌కుమార్‌, పశుసంవర్థక శాఖ అధికారి రమేష్‌, డీపీఓ తరుణ్‌ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.

ఫ కలెక్టర్‌ బి.చంద్రశేఖర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement