నల్లగొండ : పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం జిల్లా వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లు, పోలీస్ కార్యాలయాల్లో ఓపెన్ హౌస్ కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులకు పోలీస్ శాఖ పనితీరు, విధులు, నేరాల నియంత్రణ, నేర పరిశోధనలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై అవగాహన కల్పించారు. పోలీసుల విధులు, శాంతిభద్రతల పరిరక్షణ, బాధితులకు న్యాయం అందించే విధానం, రికార్డుల నిర్వహణపై వివరించారు. పోలీస్ శాఖలోని ఐటీ సెల్, సైబర్ క్రైం, ఫింగర్ ప్రింట్స్, కమ్యూనికేషన్, డీసీఆర్‌బీ, స్పెషల్ బ్రాంచ్, బాంబ్ డిస్పోజల్ టీమ్, డాగ్ స్క్వాడ్ విభాగాల పనితీరును విద్యార్థులకు వివరించారు. నల్లగొండలో నిర్వహించిన కార్యక్రమంలో అదనపు ఎస్పీ రమేష్ మాట్లాడుతూ ఓపెన్ హౌస్ వంటి కార్యక్రమాలతో పోలీస్ విధులపై విద్యార్థులకు అవగాహన పెరగడంతో పాటు పోలీస్–ప్రజల మధ్య సత్సంబంధాలు బలోపేతమవుతాయని తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌బీ సీఐ నాగరాజు, వన్‌టౌన్ సీఐ రాజశేఖర్‌రెడ్డి, టూటౌన్ ఎస్‌ఐ సైదాబాబు, ఆర్‌ఐ సంతోష్, సిబ్బంది పాల్గొన్నారు.
పోష్ చట్టం అమలు తప్పనిసరి
నల్లగొండ : ప్రైవేట్ సంస్థలు, పని ప్రదేశాల్లో.. మహిళల భద్రత, లైంగిక వేధింపుల నివారణ, నిషేధం, పరిష్కార చట్టం–2013 (పోష్ చట్ట)ను అమలు చేయాలని జిల్లా మహిళా సాధికారత కేంద్రం ప్రతినిధి శ్రీదేవి సూచించారు. నల్లగొండలోని ఎస్‌పీటీ మార్కెట్‌లో శుక్రవారం దుకాణాల యజమానులు, ఉద్యోగులకు పోస్ చట్టంపై అవగాహన కల్పించారు. చట్టం ప్రకారం పది మంది లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు పనిచేసే సంస్థల్లో అంతర్గత ఫిర్యాదుల కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. ప్రైవేట్ సంస్థల యాజమాన్యాలు, ఉద్యోగులు పోష్ చట్టంలోని నిబంధనలను పాటించాలని సూచించారు. అంతర్గత ఫిర్యాదుల కమిటీ వివరాలను షీ–బాక్స్ పోర్టల్‌లో నమోదు చేయాలని తెలిపారు. సమస్య ఎదురైతే టోల్‌ఫ్రీ నంబర్ 181కు ఫోన్ చేయడంతో పాటు షీ–బాక్స్ పోర్టల్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్‌వైజర్ లక్ష్మి, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ సయ్యద్ మొయిజుద్దీన్, వస్త్ర దుకాణాల యజమానులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
చిన్నకాపర్తిలో
ప్రజాభిప్రాయ సేకరణ
చిట్యాల : ఉదయ సముద్రం క్వాల నిర్మాణంతో భూములు కోల్పోతున్న మండలంలోని చిన్నకాపర్తి, వెంబాయి గ్రామాలకు చెందిన రైతులతో శుక్రవారం చిన్నకాపర్తి గ్రామ పంచాయతీ కార్యాలయంలో భూసేకరణ ప్రాజెక్ట్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రమాదేవి ఆధ్వర్యంలో అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. ఆయా గ్రామాలకు చెందిన 66 మంది రైతులు 34.11 ఎకరాల భూమి కోల్పోతుండగా.. రైతులు పాల్గొని తమ అభ్యంతరాలను తెలియజేశారు. కొందరు బదులుగా మరోచోట భూమి ఇవ్వాలని డిమాండ్ చేయగా, మరికొందరు మార్కెట్ ధర ప్రకారం పరిహారం చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో ఏఈ నవీన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
స్వర్ణగిరి క్షేత్రంలో గజవాహన సేవ
భువనగిరి : భువనగిరి శివారులోని స్వర్ణగిరి వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో పవిత్రోత్సవాలు కనులపండువగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం ఆలయ అర్చకులు స్వామివారికి శోభాయమానంగా గజ వాహన సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. అంతకుముందు ఉదయం స్వామివారికి హనుమంత వాహన సేవ, వేదపారాయణం, అంకురార్పణ సేవ, హంస వాహన సేవా కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు.


