మిర్యాలగూడ : గ్రామపంచాయతీల అవసరాలకు అనుగుణంగా పకడ్బందీ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) తరుణ్ చక్రవర్తి సూచించారు. శుక్రవారం మండలంలోని బోట్యానాయక్ తండా, గూడూరు గ్రామపంచాయతీల్లో నిర్వహించిన గ్రామసభల్లో ఆయన మాట్లాడారు. 2027–28 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పీపుల్స్ ప్లాన్ క్యాంపెయిన్, వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళికలను తయారు చేయాలన్నారు. వీబీజీ రాంజీ పథకం కింద తెలంగాణ జలసిరి పనులను ముమ్మరంగా చేపట్టాలని అధికారులకు సూచించారు. ప్రతి ఇంటికి ఇంకుడు గుంత, ప్రతి గ్రామానికి ఊటకుంట, ప్రతి రైతుకు ఫామ్ పాండ్ (పంట కుంట), బోర్‌వెల్స్‌కు రీచార్జ్ గుంతలు నిర్మించాలన్నారు. అలాగే ప్రతి ఆర్సీసీ ఇంటికి రూఫ్‌టాప్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్, కమ్యూనిటీ సోక్ పిట్ వంటి పనులు చేపట్టి గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. అనంతరం మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శేషగిరిశర్మ, డీపీఓ రాఘవరావు, ఏపీడీ గార్లపాటి జ్యోతిలక్ష్మి, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీఓ మాతంగి రమేష్ తదితరులు పాల్గొన్నారు.


