వర్షపాతం లోటు అధికంగా ఉన్న మండలాలు (మి.మీలలో..)
మండలం కురిసింది కురవాల్సింది లోటు శాతం
గట్టుప్పల్ 191.5 487.3 61
కేతేపల్లి 260.9 599.6 56
నిడమనూరు 249.3 571.2 56
పీఏపల్లి 178.5 392.1 54
నల్లగొండ 289.1 599.9 52
అనుముల 254.9 498.3 49
తిరుమలగిరిసాగర్ 243.5 480.6 49
చందంపేట 220.5 435 49
నేరెడుగొమ్ము 215.2 397.4 46
తిప్పర్తి 269.9 493.2 45
మాడుగులపల్లి : చింతలగూడెంలో ఎండిన వరి పొలం
ఫ 27 మండలాల్లో లోటు వర్షపాతం
ఫ భారీగా పడిపోయిన భూగర్భ జలాలు
ఫ విద్యుత్ సమస్యలతో రైతుల ఇబ్బందులు
ఫ 1.90 లక్షల ఎకరాల్లో ఎండిపోయిన పంటలు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లాను కరువు ఛాయలు కమ్ముకుంటున్నాయి. నైరుతి రుతుపవనాల సీజన్ ముగిసింది. వానాకాలం పూర్తయినా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. జిల్లాలోని 27 మండలాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా గట్టుప్పల్ మండలంలో 61 శాతం వర్షపాతం లోటు వర్షపాతం అత్యధికంగా నమోదైనట్లు అధికారులు గుర్తించారు. మరో 26 మండలాల్లోనూ వర్షపాతం లోటుగానే నమోదైంది. కేవలం ఏడు మండలాలు దామరచర్ల, కొండమల్లేపల్లి, మర్రిగూడ, చింతపల్లి, శాలిగౌరారం, నార్కట్‌పల్లి, చిట్యాలలో సాధారణ వర్షపాతం నమోదైంది. వర్షాలు లేకపోవడంతో భూగర్భ జలాలపైనా తీవ్ర ప్రభావం పడింది. పలు మండలాల్లో భూగర్భ జలాలు గణనీయంగా పడిపోగా, వర్షపాతం లోటుతో ఆయా మండలాల్లో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి.
వర్షం లేక.. పంటలు ఎండిపోయి
నైరుతి రుతుపవనాలు సెప్టెంబర్ 30వ తేదీ ముగిసే సరికి (వానాకాలం సీజన్ ముగిసిన) జిల్లాలోని చాలా మండలాల్లో పెద్ద ఎత్తున పంటలు దెబ్బతిన్నాయి. వర్షాధార పంటలతో పాటు బోర్లు, బావులపై ఆధారపడిన పంటలకు కూడా నీటి కొరత తప్పలేదు. భూగర్భ జలాలు తగ్గిపోవడంతో బోర్లలో నీటి లభ్యత కూడా తగ్గుతోంది. వీటికితోడు విద్యుత్ సరఫరాలో హెచ్చు తగ్గులు, విద్యుత్ కోతలతో బోరు బావుల కింద పంటలు సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఒక్కో మండలంలో 20 శాతం వరకు పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు భావిస్తున్నారు. జిల్లాలో 3,60,795 ఎకరాల్లో వరి సాగు చేయగా, 5,93,440 ఎకరాల్లో ఇతర పంటలు సాగు చేశారు. అందులో 1.90 లక్షలకు పైగా ఎకరాల్లో పంటలు ఎండిపోయి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
అడుగంటిన భూగర్భ జలాలు
వర్షాభావ పరిస్థితులకు తోడు భూగర్భ జలాలపై ఆధారపడిన ప్రాంతాల్లో పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది. సెప్టెంబర్ 30 నాటికి జిల్లాలోని పలు మండలాల్లో భూగర్భ జలమట్టాలు 8 నుంచి 17 మీటర్ల లోతుకు పడిపోయాయి. దామరచర్లలో అత్యధికంగా 17.76 మీటర్ల లోతులో నీటిమట్టం నమోదైంది. గతేడాది సెప్టెంబర్‌తో పోల్చితే 7.35 మీటర్ల మేర క్షీణత ఏర్పడింది. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే జిల్లాలోని 33 మండలాల్లో అత్యధిక మండలాల్లో నీటిమట్టాలు తగ్గడం గమనార్హం.


