మిర్యాలగూడ : యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్(వైటీపీఎస్)లో బొగ్గు సరఫరాకు అంతరాయం కలిగిస్తున్న వీజీఎఫ్‌ల జామింగ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు చేపట్టాలని టీజీ జెన్‌కో సీఎండీ హరీష్‌కుమార్ అధికారులను ఆదేశించారు. దామరచర్ల మండలం వీర్లపాలెంలోని వైటీపీఎస్‌ను ఆయన శుక్రవారం సందర్శించి కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్, యాష్ హ్యాండ్లింగ్ ప్లాంట్ పనితీరుపై అధికారులతో సమీక్షించారు. కోల్, యాష్ ప్లాంట్లలో కొనసాగుతున్న ఆపరేషనల్ పరిస్థితులు, పరికరాల పనితీరు, ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను ఆయన పరిశీలించారు. కోల్ హ్యాడ్లింగ్ ప్లాంట్‌లోని క్రషర్ హౌస్‌లో వైబ్రేటింగ్ గ్రిజ్లీ ఫీడర్స్ తరుచుగా జామ్ అవుతున్న అంశాన్ని ఆయన సమీక్షించారు. బొగ్గును క్రషర్‌లోకి పంపిచే క్రమంలో పెద్దరాళ్లు, పెద్ద ముక్కలు, మట్టిని నియంత్రించడానికి ఉపయోగించే వీజీఎఫ్‌లు జామ్ కావడంతో వాటిని క్లియర్ చేసేందుకు ఎక్కువ సమయం పడుతుందని అధికారులు వివరించారు. వీజీఎఫ్‌లోకి వచ్చిన బొగ్గు, ఇతర పదార్థం సరిగా ముందుకు కదలకుండా ఇరుక్కుపోయి బంకర్లకు బొగ్గు సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని చెప్పారు. ఈ సమస్యకు ప్రధాన కారణాన్ని సాంకేతికంగా గుర్తించి పరిష్కరించేందుకు వీజీఎఫ్‌ల డిజైన్, కాన్ఫిగరేషన్, ఆపరేటింగ్ పరిస్థితులు, మెటీరియల్ ఫ్లోను సమగ్రంగా పరిశీలించాలని సూచించారు. అవసరమైన చోట బీహెచ్‌ఈఎల్ సాంకేతిక బృందంతో సమన్వయం చేసుకోని తగిన డిజైన్ మార్పులు, ఇంజనీరింగ్ మెరుగుదల చేపట్టాలన్నారు. బంకర్లకు బొగ్గు నిరంతరాయంగా సరఫరా అయ్యేలా అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ సురక్షితంగా, సమర్థవంతంగా, విశ్వసనీయంగా పనిచేసేలా చర్యలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో టీజీ జెన్‌కో థర్మల్ అండ్ ప్రాజెక్ట్‌స్ డైరెక్టర్ వై.రాజశేఖర్‌రెడ్డి, చీఫ్ ఇంజనీర్ టీపీసీ పీవీ.శ్రీనివాస్, వైటీపీఎస్ స్టేజ్–1 చీఫ్ ఇంజనీర్ బి.సురేష్, స్టేజ్–2 చీఫ్ ఇంజనీర్ జె.సూర్యనారాయణతోపాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఫ జెన్‌కో సీఎండీ హరీష్‌కుమార్


