దేవరకొండ : దేవరకొండ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో రోజురోజుకు ప్రసవాల సంఖ్య పెరుగుతోంది. మెరుగైన వైద్యం అందుతుండడంతో గర్భిణులు ఈ ఆస్పత్రి వైపు మొగ్గుచూపుతున్నారు. ఫలితంగా గడిచిన మూడు నెలల్లోనే రికార్డు స్థాయిలో 344 ప్రసవాలు జరిగాయి. కాన్పులు చేయడంలో ఈ ఆస్పత్రి జిల్లాలోని అన్ని ఆస్పత్రుల కంటే ముందంజలో ఉండడం గమనార్హం.
శిశువులకు ప్రత్యేక వైద్యం
ఆస్పత్రిలో గర్భిణులు, బాలింతల కోసం ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేశారు. నవజాత శిశువుల కోసం ఎన్‌ఐసీయూ కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఈ కేంద్రంలో ఫొటోథెరపీ ద్వారా శిశువులకు ప్రత్యేక వైద్యసేవలు అందిస్తున్నారు. ఆస్పత్రిలో గైనకాలజిస్ట్, పీడియాట్రీషియన్, అనస్థీషియా, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జన్, డెంటల్ డాక్టర్ సహా వివిధ విభాగాలకు చెందిన 28 మంది వైద్యులు సేవలందిస్తున్నారు. చుట్టుపక్కల మండలాల నుంచి నిత్యం వందల సంఖ్యలో రోగులు వస్తూ ఓపీ సేవలు పొందుతున్నారు. అయితే, హైరిస్క్ కేసులను మాత్రం మెరుగైన వైద్యం కోసం ఇతర ఆస్పత్రులకు రిఫర్ చేస్తున్నారు.
200 పడకల ఆస్పత్రిగా..
దేవరకొండ ఆస్పత్రిని 200 పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇటీవల స్థానిక ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ అధికారులతో కలిసి దీనికోసం స్థల పరిశీలన చేశారు. ఇది పూర్తయితే దేవరకొండ ప్రాంత ప్రజలకు ఆధునిక వైద్యసేవలు అందుబాటులోకి రానున్నాయి.
దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రిలో పెరుగుతున్న కాన్పులు
ఫ ఎన్‌ఐసీయూ ఏర్పాటుతో మెరుగైన వైద్యసేవలు
ఫ అందుబాటులో 28 మంది స్పెషలిస్ట్ వైద్యులు


