‘డైస్‌నాన్‌’ నిబంధన ఎత్తివేయాలి | - | Sakshi
Sakshi News home page

‘డైస్‌నాన్‌’ నిబంధన ఎత్తివేయాలి

Aug 29 2026 2:10 AM | Updated on Aug 29 2026 2:10 AM

నల్లగొండ : ఉన్నత ఉద్యోగాల సాధన కోసం సెలవులు తీసుకున్న తమకు విధించిన ‘పనిలేదు–జీతం లేదు’ (డైస్‌నాన్‌) నిబంధన వెంటనే తొలగించాలని పంచాయతీ కార్యదర్శులు డిమాండ్‌ చేశారు. నిబంధన ఎత్తేయకుంటే సామూహిక సెలవులకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా పంచాయతీ అధికారిని కలిసి డైస్‌నాన్‌ తొలగించాలని వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రూప్‌–1, 2 తదితర ఉన్నత ఉద్యోగాల పరీక్షలకు ప్రిపేరై నియామక ప్రక్రియలో పాల్గొనేందుకు జిల్లాలో పనిచేస్తున్న 99 మంది గ్రామ పంచాయతీ కార్యదర్శులు తమ మండల అభివృద్ధి అధికారులు (ఎంపీడీఓలు), జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయానికి ముందుగానే సెలవు పత్రాలు సమర్పించామన్నారు. సెలవు దరఖాస్తులతో పాటు ఉన్నత ఉద్యోగాల కోసం హాజరైనట్లు ధ్రువీకరించే పత్రాలను కూడా అధికారులకు అందజేశామని తెలిపారు. గతంలో జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన ఇలా త్రిపాఠి హయాంలో తమ సెలవు కాలాన్ని డైస్‌నాన్‌గా ఎందుకు పరిగణించకూడదంటూ షోకాజ్‌ నోటీసులు జారీ చేశారని తెలిపారు. సెలవు తీసుకునే హక్కు ఉన్నప్పటికీ తమపై మాత్రమే డైస్‌నాన్‌ విధించడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇతర శాఖల్లో లేని నిబంధన మాకెందుకు?

ఇతర శాఖల్లో లేని నిబంధన మాకే ఎందుకని, తద్వారా ఉద్యోగ భద్రతతోపాటు ఆర్థిక, సర్వీస్‌ ప్రయోజనాలపై ప్రభావం పడుతోందన్నారు. తమ సెలవులను నిబంధనల ప్రకారం మంజూరు చేసి, అవసరమైతే ఎక్స్‌ట్రా ఆర్డినరీ లీవ్‌గా పరిగణించాలని వినతిలో కోరారు. ఇటీవల కలెక్టర్‌ బి.చంద్రశేఖర్‌ను టీఎన్‌జీఓ నాయకులు కలిసి సమస్యను వివరించగా డైస్‌నాన్‌ ఎందుకు విధించారనే అంశాన్ని పరిశీలిస్తామని కలెక్టర్‌ చెప్పారని కార్యదర్శులు పేర్కొన్నారు. శుక్రవారం డీపీఓకు వినతిపత్రం సమర్పించగా సానుకూలంగా స్పందించినట్లు సంఘం నాయకులు తెలిపారు. అనంతరం డీపీఓను సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీఎన్‌జీఓ జిల్లా కార్యదర్శి శేఖర్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శుల సంఘం అధ్యక్షుడు ఎస్‌కే.ఖాసీం, కార్యదర్శి సతీష్‌, రాష్ట్ర కార్యదర్శి, ట్రెజరర్‌ నిరంజన్‌, జిల్లా అసోసియేట్‌ ప్రెసిడెంట్‌ షఫీతో పాటు జిల్లాలోని పలువురు పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

ఫ సెలవులో ఉన్న పంచాయతీ కార్యదర్శుల డిమాండ్‌

ఫ డీపీఓకు వినతిపత్రం అందజేత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement