మిర్యాలగూడ : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) కార్యక్రమాన్ని అత్యంత బాధ్యతతో నిర్వహించి.. లోపాలు లేకుండా ఓటరు జాబితా రూపొందించాలని కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. మిర్యాలగూడ మండలం నందిపాడు గ్రామంలో ఇంటింటి సర్వేను ఆయన పరిశీలించి బీఎల్‌ఓలు, రెవెన్యూ సిబ్బందికి పలు సూచనలు చేశారు. సర్వే సందర్భంగా ఓటర్ల వివరాల సేకరణ, ఫారాలు నింపడం, ఆన్‌లైన్ అప్‌లోడ్ ప్రక్రియలను పరిశీలించిన కలెక్టర్ ప్రతి దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. ముఖ్యంగా నిరక్షరాస్యులు, వృద్ధులు, అవగాహన లేని ఓటర్లకు అవసరమైన సాయం అందించి వారి వివరాలను సక్రమంగా నమోదు చేయాలన్నారు. ఇంటింటి సర్వేలో సేకరించిన సమాచారాన్ని వెంటనే డిజిటల్ విధానంలో నమోదు చేసి పెండింగ్ లేకుండా చూడాలన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటరు జాబితా కీలకమైందని, అర్హులైన ప్రతి పౌరుడి పేరు జాబితాలో ఉండేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, ఆర్‌ఐ, బీఎల్‌ఓలు పాల్గొన్నారు.
ఇంటర్‌లో ప్రవేశాలకు స్పాట్ కౌన్సిలింగ్
నల్లగొండ : తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో 2026–27 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో మిగిలిన సీట్ల భర్తీ కోసం జూలై 6న జిల్లా కేంద్రాల్లో స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు జిల్లా కోఆర్డినేటింగ్ అధికారి (డీసీఓ) శోభారాణి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత కలిగిన విద్యార్థులు టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్ జూనియర్ కళాశాల, అనుముల (పోప్ పాల్ జూనియర్ కాలేజీ ప్రాంగణం), బత్తాయి మార్కెట్ ఎదురుగా, నల్లగొండకు, విద్యార్థినులు తెలంగాణ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ స్కూల్, నిడమానూరు(ఎస్‌ఆర్‌టీఎస్), సాగర్ రోడ్, నల్ల గొండకు రావాలని పేర్కొన్నారు. ఒరిజినల్ ధ్రువపత్రాలతో పాటు రెండు సెట్ల జిరాక్స్ ప్రతులను తీసుకువచ్చి కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని సూచించారు. స్పాట్ కౌన్సెలింగ్ ద్వారానే మిగిలిన సీట్లను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. 2026 రెగ్యులర్‌గా పాస్ అయిన వారు మాత్రమే అర్హులని పేర్కొన్నారు.
పారదర్శకంగా విక్రయాలు చేపట్టాలి
మిర్యాలగూడ : రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని విత్తనాలు, ఎరువుల విక్రయాల్లో పూర్తి పారదర్శకత పాటించాలని జిల్లా వ్యవసాయ అధికారి వల్లోజు వినోద్‌కుమార్ సూచించారు. మిర్యాలగూడలోని ఫర్టిలైజర్స్, సీడ్స్ దుకాణాల్లో శనివారం ఆయన తనిఖీలు చేపట్టారు. స్టాక్ వివరాలు, ధరల పట్టికలు, విక్రయ రికార్డులు, లైసెన్స్‌లను పరిశీలించి మాట్లాడారు. ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయాలు జరిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వరి సాగులో అధిక దిగుబడులు అందించే సన్నరకాల విత్తనాలను రైతులకు చేరవేసే దిశగా అధికారులు పనిచేయాలన్నారు. రాబోయే రోజుల్లో వాతావరణ మార్పుల ప్రభావం వ్యవసాయంపై పడే అవకాశం ఉన్నందున రైతులకు ముందస్తు సూచనలు అందించాలని, పంటల ఎంపికలో శాసీ్త్రయ సలహాలు ఇవ్వాలని అదికారులకు సూచించారు. ఆయన వెంట ఏఓ రుషేంద్రమణి, ఏఈఓలు ఉన్నారు.
అప్పీలుదారుకు రూ.5 వేల పరిహారం
నల్లగొండ : సమాచార హక్కు చట్టం కింద కోరిన సమాచారాన్ని సకాలంలో పూర్తిగా అందించడంలో విఫలమైన జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ప్రజా సమాచార అధికారిపై తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అప్పీలుదారుకు రూ.5 వేల పరిహారం చెల్లించడంతో పాటు రికార్డుల పరిశీలనకు అవకాశం కల్పించాలని ఆదేశించింది. ధర్మావత్ బాల్సన్ నాయక్ 2010–2025 మధ్యకాలానికి సంబంధించిన 14 అంశాల సమాచారాన్ని కోరగా, మూడు అంశాలకు మాత్రమే ఆలస్యంగా సమాచారం అందించినట్లు కమిషన్ గుర్తించింది. దీంతో మిగిలిన రికార్డులను కార్యాలయంలో పరిశీలించే అవకాశం కల్పించి, పరిశీలన అనంతరం రెండు వారాల్లో ఉచితంగా సమాచారం ఇవ్వాలని ఆదేశించింది. ఆదేశాలను అమలు చేయకపోతే ఆర్‌టీఐ చట్టంలోని సెక్షన్–20 ప్రకారం చర్యలు తీసుకుంటామని కమిషన్ హెచ్చరించింది.


